Begin typing your search above and press return to search.

భారీ బంగారం కంటైనర్ మాయం... నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు!

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడిగా.. భారీ బంగారం కంటైనర్ ను దొంగిలించిన కేసు నిలిచిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 April 2024 4:43 AM GMT
భారీ బంగారం కంటైనర్ మాయం... నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు!
X

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడిగా.. భారీ బంగారం కంటైనర్ ను దొంగిలించిన కేసు నిలిచిన సంగతి తెలిసిందే. సుమారు 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కార్గో కంటైనర్ ను గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి కొందరు దుండగులు చోరీ చేశారు. తాజాగా ఆ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

అవును... కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసుగా ఉన్న భారీ బంగారం కంటైనర్ వ్యవహారంలో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇదే క్రమంలో... ఈ ఘటనలో మరో ముగ్గురికి వారెంట్లు కూడా జారీ చేశారని సమాచారం. అసలు ఈ కేసేమిటి.. నాడు అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం..!

వివరాళ్లోకి వెళ్తే... 2023 ఏప్రిల్ 17న స్విట్జర్లాండ్‌ నుంచి టొరంటో ఎయిర్‌ పోర్టుకు ఒక భారీ విమానం చేరుకుంది. దానిలోని కంటైనర్ లో సుమారు 20 మిలియన్‌ కెడియన్ డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విదేశీ నగదు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో ఆ కంటైనర్‌ ను సేఫ్ ప్లేస్ కి తరలించే పని మొదలైంది. అయితే... ఈ క్రమంలో ఆ భారీ కంటైనర్ అదృశ్యమైంది.

అప్పట్లో ఈ దోపిడీ తీవ్ర సంచలనం సృష్టించింది. అంత భారీ కంటైనర్ మాయం అవ్వడం సినిమాల్లోనే తప్ప రియల్ గా కూడా సాధ్యమే అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో సరిగ్గా ఏడాది తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించింది. ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దోపిడీకి విమానయాన సిబ్బంది సహకరించినట్లు చెబుతున్నారు!