భారతీయులకే అమెరికాలో సీఈవో ఛాన్స్... రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... మీరు భారతీయులైతే అమెరికాలో సీఈవో కాలేరని ఓ జోక్ గతంలో ఉండేదని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని వెల్లడించారు.
By: Tupaki Desk | 27 April 2024 5:32 AM GMTప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టాప్ కంపెనీల్లో సీఈవోలు భారతీయులు, భారత సంతతి వ్యక్తులు ఉంటున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో... అమెరికా కంపెనీల్లోని ఈసీవో పోస్టులపై భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ఆసక్తికర వ్య్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికాలోని టాప్ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని అన్నారు.
అవును... అమెరికా కంపెనీల్లో భారతీయుల ప్రాధాన్యత, ఆధిపత్యం, ప్రాముఖ్యత పెరుగుతున్నాయని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వెల్లడించారు! అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని సంస్థలకు సీఈవో అయ్యే అవకాశాలు భారతీయులకే భారీగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... మీరు భారతీయులైతే అమెరికాలో సీఈవో కాలేరని ఓ జోక్ గతంలో ఉండేదని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని వెల్లడించారు. భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేరనే విశ్లేషణలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. దీనికి ఉదాహరణలుగా... గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్ బక్స్ లాంటి కంపెనీలను పేర్కొన్నారు.
ఇదే సమయంలో... ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ప్రతీ 10 మంది సీఈవో లలో ఒకరికంటే ఎక్కువ అమెరికాలో చదువుకున్న భారత వలసదారులే ఉన్నారని చెప్పిన ఎరిక్ గార్సెట్టి.. ప్రపంచ అభివృద్ధి కోసం సాంకేతిక విప్లవానికి కేంద్రంగా భారత్ - అమెరికాలు నిలుస్తున్నాయని తెలిపారు.
ఇక... ఇటీవల అగ్రరాజ్యంలో వరుసగా చోటుచేసుకుంటున్న భారతీయులు, భారత సంతతి విద్యార్థుల మరణాలపై స్పందించారు గార్సెట్టి. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... అమెరికాలో దాదాపు 2.40 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారని.. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని.. వీటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ప్రతీ విద్యార్థి శ్రేయస్సుపైనా తాము ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు!