భారతీయులకు గ్రీన్ కార్డ్ గండం.. ఇబ్బందుల్లో లక్షల సంఖ్యలో పిల్లలు!
అమెరికాలో నివాసం ఉండాలనుకునే విదేశీయులకు ఆ దేశం గ్రీన్ కార్డ్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Sep 2023 5:02 AM GMTఅమెరికాలో నివాసం ఉండాలనుకునే విదేశీయులకు ఆ దేశం గ్రీన్ కార్డ్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. హెచ్1బీ వీసాతో ఆ దేశంలో ఉద్యోగం చేయడానికి వెళ్లిన భారతీయులు ఆ తర్వాత అక్కడ శాశ్వతంగా స్థిరపడాలనుకుంటారు. ఇలాంటివారి కోసం గ్రీన్ కార్డు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మంది భారతీయ చిన్నారులు తమ తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.
గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం 10 లక్షల మందికిపైగా ఎదురుచూస్తున్నారు. అయితే అమెరికా పరిమిత సంఖ్యలోనే ప్రస్తుతం గ్రీన్ కార్డులు జారీ చేస్తోంది. ఇప్పుడిదే చిన్నారులను తమ తల్లిదండ్రులకు దూరం చేసేలా మారబోతోంది.
అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఇప్పటికే 10.7 లక్షలకుపైగా భారతీయులు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ దేశాలకు సంబంధించి గ్రీన్ కార్డుల జారీలో పరిమితులు ఉన్నాయి. కేవలం ఏటా 7 శాతం మంది విదేశీయులకే అమెరికా గ్రీన్ కార్డులు ఇస్తోంది. దీంతో కేవలం భారతీయులు మాత్రమే కాకుండా విద్యా, ఉద్యోగాల నిమిత్తం అమెరికాకు చేరుకున్న వివిధ దేశాల వారందరికీ గ్రీన్ కార్డులు జారీ చేయాలంటే ఇందుకు దాదాపు ఏకంగా 134 ఏళ్లు పడుతుందని అంచనా.
గ్రీన్ కార్డు కోసం వేచిచూసి వారిలో మరణాలు, వృద్ధాప్యం వంటి కారణాలతో కొందరు ఈ జాబితా నుంచి తగ్గిపోయినా.. అందరికీ గ్రీన్ కార్డులు జారీ ప్రక్రియకు 54 ఏళ్లు పడుతుందని చెబుతున్నారు. దీంతో వేలాది మంది భారతీయ పిల్లలు వారి తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు సమాచారం.
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలు హెచ్–4 వీసా కింద తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి అవకాశం ఉంది. అయితే, హెచ్–4 కేటగిరి కింద పిల్లల వయసు 21 ఏళ్లు వచ్చే వరకు మాత్రమే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. ఈలోపు గ్రీన్ కార్డు తెచ్చుకోలేకపోతే 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అక్కడ ఉండేందుకు అనుమతి ఉండదు.
అయితే, డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా ఇలాంటి వారికి రెండు ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చదువుకునే విదేశీ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్1 (స్టూడెంట్) వీసా పొందడం లేదా తమ మాతృదేశానికి వెళ్లిపోవడం. అయితే చిన్నప్పటి నుంచి అమెరికాలోనే ఉండి అక్కడే చదువుకొని.. చివరకు దేశం విడిచి వెళ్లిపోవడం చాలా కష్టం. తల్లిదండ్రులు అమెరికాలో ఉండిపోతే ఈ పిల్లలు ఇండియాకు వచ్చి కుటుంబాన్ని వదిలి ఏంచేస్తారనేదే ప్రశ్న.
ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డుల జారీని వేగవంతం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల పౌరసత్వ బిల్లును అక్కడి కాంగ్రెస్ లో ప్రవేశపెట్టింది. గ్రీన్ కార్డుల జారీకి దేశాలవారీ కోటాను ఎత్తివేయాలనే ప్రతిపాదన ఈ బిల్లులో ఉంది. అలాగే హెచ్ 1బి వీసాలలో ముఖ్యమైన మార్పులు చేయాలనే ప్రతిపాదన సైతం ఇందులో చోటు చేసుకుంది.
దేశాలవారీ కోటాల వల్ల మునుపటి సంవత్సరాల్లో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన గ్రీన్ కార్డులను వలసదారుల సంతానానికీ, భార్య లేదా భర్తకు మంజూరు చేయడం ద్వారా వారి కుటుంబాలను విడిపోకుండా సమైక్యంగా ఉంచాలని ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లక్షలాది మంది భారతీయులతో పాటు మెక్సికన్లు, చైనీయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.