Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసాదారులు అమెరికాలో ఇల్లు కొనడం లాభమా? నష్టమా?

అమెరికాకు వెళ్లే ప్రతీ భారతీయుడికి అక్కడి పౌరసత్వం అనేది ఒక కళ. ప్రభుత్వాలు మారుతున్నా.. కఠిన వలస విధానాల వల్ల విదేశీయులకు అమెరికాలో స్థిరపడేందుకు ఎన్నో ఆంక్షలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Feb 2025 5:30 PM GMT
హెచ్1బీ వీసాదారులు అమెరికాలో ఇల్లు కొనడం లాభమా? నష్టమా?
X

అమెరికాకు వెళ్లే ప్రతీ భారతీయుడికి అక్కడి పౌరసత్వం అనేది ఒక కళ. ప్రభుత్వాలు మారుతున్నా.. కఠిన వలస విధానాల వల్ల విదేశీయులకు అమెరికాలో స్థిరపడేందుకు ఎన్నో ఆంక్షలు వస్తున్నాయి. గ్రీన్ కార్డ్, H1B వీసా అన్నది జీవిత లక్ష్యంగా పోరాడుతున్న పరిస్థితులు అమెరికాలో ఉన్నాయి. హెచ్1బీ ఉన్న భారతీయులకు, అమెరికన్ లో స్థిరపడితే లాభమా? నష్టమా? అన్న ఆందోళన ఇప్పుడు వెంటాడుతోంది. అమెరికాలో ఒక ఇంటిని కొనడం, స్థిరపడడం, భవిష్యత్తును ప్లాన్ చేయడం ఇవన్నీ ప్రభుత్వం కఠిన చర్యలతో ఒక జూదంలా మారుతోంది. . ఉద్యోగానికి సంబంధించిన చిన్నపాటి మార్పు జరిగినా.. లేదా వీసా తిరస్కారానికి గురైనా పూర్తిగా దేశం విడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. దీని కారణంగా అమెరికాలో ఇల్లు కొనడం.. ఇంటిపై పెట్టుబడి పెట్టడం అన్నది భారతీయులకు ఒక పెద్ద రిస్క్ గా ఇప్పుడు తయారైంది. దీర్ఘకాలిక ప్రణాళికలు తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.

అయినప్పటికీ, వేలాది మంది H1B వీసాదారులు ఇండ్లు కొనుగోలు చేస్తున్నారు. కొందరి దృష్టిలో ఇది మంచి పెట్టుబడి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతుందనీ, అద్దెకు డబ్బు ఖర్చు చేయడం వృథా అనే భావన కలిగి ఉన్నారు.. మరికొందరు తమ ఉద్యోగ భద్రతపై నమ్మకంతో, తమ కంపెనీలపై విశ్వాసంతో లేదా భవిష్యత్తులో గ్రీన్ కార్డు వచ్చే అవకాశంపై ఆశతో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.

కుటుంబం కలిగి ఉన్నవారికి కొత్త ఇంటిని కొనడం తప్పనిసరిగా మారింది.. కానీ దీనికి సంబంధించి ఉన్న రిస్క్‌లు తక్కువవేమీ కాకున్నా అనివార్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. H1B వీసాదారుడు ఉద్యోగం కోల్పోతే, కొత్త ఉద్యోగాన్ని 60 రోజులలోపు పొందాల్సి ఉంటుంది. లేకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. కానీ, బాంక్ నుంచి తీసుకున్న హోమ్ లోన్ కేవలం వీసా లేకపోవడంతోనే మాఫీ అవదు. ఆస్తిని వెంటనే అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడితే, మార్కెట్ బలహీనంగా ఉంటే ఆ ఇంటికి సరైన ధర రాక ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అప్పుల పాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనిని నివారించేందుకు కొందరు అద్దెకు పెట్టే వీలున్న ఇళ్లను కొనుగోలు చేస్తారు. ఇలా చేస్తే, తాము దేశం విడిచి వెళ్లాల్సి వచ్చినా ఆస్తి భారంగా మారకుండా, ఒక పెట్టుబడిగా ఉంటుందని ఆశిస్తారు.

వీసా అనిశ్చితిలో జీవిస్తూ, భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడం ఇప్పుడు అమెరికాలోని భారతీయులకు కష్టంగా మారింది. మానసికంగా ఎంతగానో ప్రభావం చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది పెళ్లి చేసుకోవడానికైనా, పిల్లలను పెంచడానికైనా వెనుకంజ వేస్తున్నారు. దీని మూలంగా ఒక కుటుంబం స్థిరంగా ఉండే అవకాశాన్ని కోల్పోతున్నారు.

ఈ సమస్య అమెరికాలో స్థిరపడాలనుకునే వారి ఆలోచన ధోరణిని మారుస్తోంది. అమెరికా వలస విధానం అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను వీసా అనిశ్చితిలో కూరుకుపోయేలా చేస్తోంది. అమెరికాలో సొంతిల్లు, కుటుంబ ప్రణాళిక, ఇతర దీర్ఘకాలిక నిర్ణయాలపై పునరాలోచనలో పడేలా చేస్తున్నాయి. ప్రతిభ ఆధారంగా కాకుండా, వీసా ఆమోదం , గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ సమయాల ఆధారంగా అమెరికాలోని భారతీయుల నిర్ణయాలు మారిపోతున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు పాలసీల్లో మార్పులు అవసరం. అప్పుడే అమెరికాలో తాత్కాలిక వలసదారుల భవిష్యత్తు మరింత భద్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..