భారతీయ అమెరికన్ల మద్దతు ఎవరికో తెలిసింది.. తాజా సర్వే చెప్పింది!
ఈ సమయంలో భారతీయ అమెరికన్ల మద్దతుపై ఓ సర్వే కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 28 Oct 2024 9:30 PM GMTఅగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటు కమలా హారిస్, ఇటు రిపబ్లికన్స్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల మధ్య ప్రచార కార్యక్రమాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో భారతీయ అమెరికన్ల మద్దతుపై ఓ సర్వే కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును.. వచ్చే నెల 5న జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల మద్దతుపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో ప్రతీ ఓటూ ఇద్దరికీ కీలకమే అని పలు సర్వేలు అభిప్రాయపడుతున్న వేళ, భారతీయుల మద్దతుపై "ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే" ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా... 61 శాతం మంది భారతీయ అమెరికన్లు హారిస్ వైపే ఉన్నారని.. డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా 31 శాతం మంది మాత్రమే ఉన్నారని తెలిపింది. దీంతో... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ భారతీయ అమెరికన్లు దాదాపు స్పష్టమైన ఏకాభిప్రాయం కలిగి ఉన్నట్లున్నారని అంటున్నారు.
అయితే... ఇలా ఇండియన్ అమెరికన్ల మద్దతు హారిస్ కే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇది డెమోక్రాటిక్ పార్టీకి ప్రతికూల అంశమే అని అంటున్నారు పరిశీలకులు. కారణం... 2020 నాటి ఎన్నికల సమయంలో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థికి ఉన్న మద్దతు 2024కి వచ్చేసరికి తగ్గింది. ఇదే సమయంలో 2020లో ట్రంప్ మద్దతు 22 శాతంగా ఉండగా.. అది ఇప్పుడు 31కి పెరిగింది.
అంటే... ఈ ఎన్నికల్లో అమెరికన్ ఇండియన్స్ మద్దతు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కే ఎక్కువగా ఉన్నప్పటికీ.. గతంతో పోలిస్తే మాత్రం తక్కువ అని స్పష్టమవుతుందన్నమాట. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న తొలి భారతీయ అమెరికన్ అయిన కమలకు ఈ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేనట్లే అనే కాదు.. ఆందోళన కలిగించేవి కూడా అని అంటున్నారు.
కాగా... అమెరికాకు వలస వచ్చినవారిలో మెక్సికన్లు మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానం భారతీయులదే. దీంతో... ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రభావం మాత్రం ఎక్కువగా చూపగలరని అంటున్నారు. దీంతో... ఇండియన్ అమెరికన్స్ పై ఇరు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు!
మరోపక్క ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. భారత్ కు పలు కష్టాలు ఉన్నాయని, అందులో అమెరికాకు ఎగుమతి చేసే వాటి విషయంలో భారీ సుంకాల ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని.. ఐటీ ప్రొఫెషనల్స్ విషయంలోనూ ఇబ్బందులు తప్పకపోవడంతో పాటు హెచ్-1బీ వీసా షరతులు మారే అవకాశం ఉందని అంటూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే!