Begin typing your search above and press return to search.

పొరపాటున బ్యాంక్ ఖాతాలోకి రూ.16 లక్షలు.. ఇవ్వనని చెప్పి జైలుకు!

అత్యాశకు పోయిన భారతీయుడు సింగపూర్ లో జైలుపాలు అయిన ఉదంతమిది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 5:30 AM GMT
పొరపాటున బ్యాంక్ ఖాతాలోకి రూ.16 లక్షలు.. ఇవ్వనని చెప్పి జైలుకు!
X

అత్యాశకు పోయిన భారతీయుడు సింగపూర్ లో జైలుపాలు అయిన ఉదంతమిది. పొరపాటున తన బ్యాంక్ ఖాతాలో పడిన రూ.16 లక్షల మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ససేమిరా అన్నందుకు ప్రతిగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తనది కాని డబ్బు కోసం పేరాశను ప్రదర్శించిన వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 47 ఏళ్ల పెరియసామీ మథియాళగన్ సింగపూర్ లో పని చేస్తున్నాడు.

భారతీయుడైన ఇతని బ్యాంక్ ఖాతాకు మన రూపాయిల్లో రూ.16 లక్షల మొత్తం పొరపాటున బదిలీ అయ్యాయి. ఆ డబ్బులు తనవి కావన్న విషయం మథియాళగన్ కు తెలిసినప్పటికీ.. ఆ డబ్బులతో తనకున్న అప్పుల్ని తీర్చేశాడు. కొంత మొత్తాన్ని భారత్ లోని తన కుటుంబానికి పంపాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఈ పొరపాటును గుర్తించిన సంస్థ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో మథియాళగన్ కు బ్యాంకు లేఖ రాసింది. పొరపాటున వేరే ఖాతాలో జమ కావాల్సిన మొత్తం అతడి ఖాతాకు బదిలీ అయ్యాయని.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఏదైతే సంస్థ నుంచి డబ్బులు పొరపాటున జమ అయ్యాయో.. ఆ సంస్థ కూడా వ్యక్తిగతంగా లేఖ రాసింది. వారి విన్నపానికి ప్రతిగా.. తన దగ్గర డబ్బుల్లేవని.. తనకున్న అప్పుల్ని తీర్చుకున్నట్లుగా తాపీగా బదులిచ్చాడు.

దీంతో.. అతడి వ్యవహారశైలిని తప్పు పడుతూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో అతన్ని గత ఏడాది నవంబరులో పోలీసులు విచారించగా.. నెలకు కొంత మొత్తం చొప్పున తిరిగి ఇస్తానని హామీ ఇవ్వటంతో అతడ్ని వదిలేశారు. అయితే.. మాటలే తప్పించి చేతల్లో తన కమిట్ మెంట్ చూపని అతడిపై కోర్టులో కేసు వేశారు. ఇరుపక్షాల వాదనలు విన్నకోర్టు అతనికి తొమ్మిది వారాల జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. పేరాశతో పరువు పోగొట్టుకోవటమే కాదు.. జైలుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.