కర్ణాటక టు కెనడా... ప్రధాని రేసులో భారతీయుడు!
ఈ సమయంలో పలువురు భారత సంతతి నేతల పేర్లు తెరపైకి రాగా.. తాజాగా మరోపేరు రేసులోకి వచ్చింది.
By: Tupaki Desk | 11 Jan 2025 5:30 AM GMTకెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అటు ప్రధానమంత్రి పదవితో పాటు, ఇటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన వేళ.. తదుపరి ప్రధాని ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఈ సమయంలో పలువురు భారత సంతతి నేతల పేర్లు తెరపైకి రాగా.. తాజాగా మరోపేరు రేసులోకి వచ్చింది.
అవును.. కెనడా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కొత్త నాయకుడిని ఎన్నుకున్న అనంతరం తాను పార్టీ అధ్యక్ష పదవితో పాటు, కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... తదుపరి ప్రధాని ఎవరు అనే చర్చ నడుస్తుంది.
ఈ సమయంలో... తదుపరి కెనడా ప్రధాని రేసులు లిబరల్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇందులో భాగంగా... ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. ఆయనతోపాటూ మెలనీ జోలీ, మార్క్ కార్నీ, క్రిస్టినా ఫ్రీలాండ్, క్రిస్టీ క్లార్క్ ల పేర్లు వినిపించాయి.
వీరితో పాటు ప్రముఖంగా భారత సంతతికి చెందిన ఇద్దరూ ఎంపీలూ జార్జ్ చాహల్, అనిత ఆనంద్ ల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా.. భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్ర ఆర్య అధికారికంగా కెనడా తదుపరి ప్రధానమంత్రి రేసులోకి ప్రవేశించారు.
ఒట్టవాలోని నేపియన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు... ఈ సందర్భంగా... కెనడాను పునర్నిర్మించడానికి, భవిష్యత్ తరాలు శ్రేయస్సును పొందేందుకు సంఖ్యా పరంగా చిన్నదైనా, సమర్థవంతమైన ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి కెనడా తదుపరి ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక టు కెనడా!:
కర్ణాటకలోని సిరా తాలుకాలోని ద్వార్లు విలేజ్ కు చెందిన చంద్ర ఆర్య.. ధ్వారాడ్ లోని కౌసలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ నుంచి ఎంబీయే పట్ట పొందారు. ఆయన భార్య, చిన్నకుమారుడితో కలిసి 20 ఏళ్ల క్రితం ఒట్టావాకు వెళ్లారు. అక్కడ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ లో నిరాడంబరమైన జీవితాన్ని ప్రారంభించారు.
రాజకీయాల్లోకి రాకముందు చంద్ర ఆర్య మొదట ఇంజనీర్ గా పని చేశారు. ఆ తర్వాత ఓ బ్యాంకులో పెట్టుబడి సలహాదారుగాను పనిచేశారు. ఈ క్రమంలో ఓ చిన్న హైటెక్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా ఆరేల్లు గడిపిన ఆయన అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. ఈ క్రమంలో... 2015లో హౌస్ ఆఫ్ కామన్స్ కి మొదట ఎన్నికల్లో గెలిచాడు.
అనంతరం 2019 లోనూ తిరిగి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో 2022లో హౌస్ ఆఫ్ కామన్స్ లో కన్నడలో మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించిన చంద్ర ఆర్య.. నాటి తన ప్రసంగ వీడియోను పంచుకుంటూ... తాను కెనడియన్ పార్లమెంట్ లో తన మాతృభాష కన్నడలో మాట్లాడినట్లు రాసుకొచ్చారు. భారతదేశం బయట ఏ పార్లమెంట్ లో అయినా కన్నడలో మాట్లాడటం ఇదే తొలిసారని తెలిపారు.