యూఎస్ లో గుజరాత్ కుటుంబం మృతి... భారతీయుడే దోషి!
మంచు తుఫాను కారణంగా 2022 జనవరిలో కెనడా - అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ విషాదాంతానికి గురైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Nov 2024 4:56 AM GMTమంచు తుఫాను కారణంగా 2022 జనవరిలో కెనడా - అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ విషాదాంతానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ ఘటనకు గుజరాత్ లో మానవ అక్రమ రవాణా రాకెట్ లకు సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. ఈ సమయంలో ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది కోర్టు.
అవును... కెనడా - అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన భారతీయ వలస కుటుంబం స్తంభించిపోవడంతో మానవ అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలపై ఒక భారతీయ పౌరుడితో సహా ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది కోర్టు. వీరిలో హర్షకుమార్ పటేల్ అలియాస్ డర్టీ హ్యారీ (29) ఒకడు కాగా.. ఫ్లోరిడా నివాసి స్టీవ్ షాండ్ (50) మరొకరు.
హర్షకుమార్ పటేల్, స్టీవ్ షాండ్ లు అక్రమంగా దేశంలోకి వలసవచ్చినవారిని తీసుకురావడానికి కుట్ర పన్నడంతోపాటు.. మానవ అక్రమ రావాణాకు సంబంధించిన నాలుగు ఆరోపణలపై దోషులుగా నిర్ధారించబడ్డారు. ఈ కేసుల్లో వీరిద్దరికీ గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన యూఎస్ అటార్నీ లూగార్... కొన్ని వేల డాలర్లు సంపాదించడంకోసం ఈ ట్రాఫికర్లు పురుషులు, స్త్రీలు, పిల్లలను అసాధారణమైన ప్రమాదంలో ఉంచారని.. ఈ అనూహ్యమైన దురాశ కారణంగా సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో చిన్న పిల్లలతో సహా తల్లితండ్రులు స్థంభించిపోయారని అన్నారు.
కాగా... ఈ ఘటనలో మృతులు జగదీష్ పటేల్ (39), అతడి భార్య వైశాలి (37), కుమార్తె విహంగీ (11), కుమారుడు ధార్మిక్ (3) మరణాలు కెనడా, యుఎస్ లోని గుజరాతీ సమాజాన్ని తీవ్రంగా కదిలించిన సంగతి తెలిసిందే. వీరు గాంధీనగర్ సమీపంలోని డింగుచాకు చెందిన ఈ కుటుంబం సభ్యులు.