పాలస్తీనాకు మద్దతు.. భారతీయ విద్యార్థిని వీసా రద్దు
పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 March 2025 9:48 AM ISTపాలస్తీనాకు మద్దతుగా కొలంబియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఇటీవల పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహరాన్ని సీరియస్ గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం.. చర్యల కత్తిని ఝుళిపించింది. తాజాగా ఈ చర్యల్లో భాగంగా భారత్ కు చెందిన ఒక విద్యార్థి వీసాను రద్దు చేసింది. అయితే.. అమె స్వీయ బహిష్కరణకు గురైనట్లుగా యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారికంగా ప్రకటించింది.
తాజాగా డీహెచ్ఎస్ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ ఒక ప్రకటన చేశారు. భారత విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను స్వీయ బహిష్కరణ కోసం సీబీపీ హోం యాప్ ను ఉపయోగించినందుకు తాము సంతోషిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మధ్యనే ఈ యాప్ ను ప్రారంభించారు. దీన్ని ఉపయోగించి.. స్వచ్ఛందంగా దేశాన్ని వీడే అవకాశాన్ని ఇందులో కల్పిస్తారు. భారత విద్యార్థిని రంజనీ ఈ యాప్ ను వినియోగించి.. తాను అమెరికాను వీడాలనుకున్న విసయాన్ని నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై స్పందించిన క్రిస్టీ.. అమెరికాలో నివసించేందుకు.. చదువుకోవటానికి వీసాను మంజూరు చేస్తామని.. ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపినప్పుడు వీసాలను రద్దు చేస్తామన్నారు. అలాంటి వారు అమెరికాలో ఉండకూడదని.. మిలిటెంట్ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన భారత విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణకు వినతి పెట్టుకున్నట్లుగా పేర్కొన్నారు. మరోవైపు.. ఎఫ్ 1 విద్యార్థి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటుందన్న పాలస్తీనాకు చెందిన మరో విద్యార్థిని లెకా కోర్డియాను కూడా అమెరికా అధికారులు తాజాగా అరెస్టు చేశారు. వర్సిటీ అటెండెన్సు సరిగా లేని కారణంగా ఆమె వీసాను 2022 జనవరి 26నే రద్దు చేయగా.. ఆమె ఇప్పటికి ఆ దేశంలోనే ఉన్నట్లుగా గుర్తించి.. అరెస్టు చేశారు.