పార్ట్ టైంకే క్యూ కట్టిన కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏమిటి?
ఎవరు ఎన్నయినా చెప్పనీ.. కొన్నాళ్లుగా అమెరికా కంటే కెనడానే భారతీయ విద్యార్థుల డెస్టినేషన్ గా మారింది.
By: Tupaki Desk | 15 Oct 2024 10:30 PM GMTఎవరు ఎన్నయినా చెప్పనీ.. కొన్నాళ్లుగా అమెరికా కంటే కెనడానే భారతీయ విద్యార్థుల డెస్టినేషన్ గా మారింది. విద్యార్థులే కాదు.. ఉద్యోగార్థులకూ కెనడానే కేంద్ర అయింది. అయితే, మరీ ముఖ్యంగా ఖలిస్థానీ వాదంతో రెండేళ్లుగా కెనడాతో భారత్ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కెనడాలో స్థిరపడిన సిక్కులు 8 లక్షల మంది వరకు ఉండడం.. వారిని కాదనలేని స్థితిలో ప్రభుత్వాలు ఉండడంతో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం కెనడా వెళ్తున్న భారతీయుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
పార్ట్ టైమ్ జాబ్ లు చేస్తూ..
ఇటీవల మీడియాలో కెనడాకు చెందిన ఓ న్యూస్ హైలైట్ అయింది. పార్ట్ టైమ్ జాబ్ కోసం టిమ్ హోర్టన్స్ అనే ప్రసిద్ధ కాఫీ, ఫాస్ట్ ఫుడ్ స్టోర్ ఎదుట విదేశీ విద్యార్థులు బారులుతీరి ఉండడమే దీనికి కారణం. అయితే, వీరిలో ఎక్కువ సంఖ్యలో భారతీయులే ఉన్నారు. కెనడాలోని పెద్ద నగరాల్లో ఒకటైన టొరంటోలో భారతీయ విద్యార్థి నిషాత్, టిమ్ హార్టన్స్ ఔట్ లెట్ వద్ద జాబ్ కోసం బారులు తీరిన వీడియోను తీసి పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గమనార్హం ఏమంటే.. ఈ వీడియో తీసిన నిషాత్ కూడా పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం నెల రోజులుగా వెతుకుతుండడం. హోర్టన్స్ లో జాబ్ మేళా కోసం అరగంట ముందే వెళ్లినా పెద్ద క్యూ కనిపించిందని అతడు తెలిపాడు. అప్పటికే 100 మందికి పైగా విద్యార్థులు జాబ్ మేళాకు హాజరయ్యారని చెప్పాడు.
కెనడాలోనూ సంక్షోభం?
ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమైన కెనడా ప్రశాంతతకు మారుపేరు. అయితే, ట్రూడో పాలన, ఖలిస్థానీలకు మద్దతుతో ఆ దేశంలో పరిస్థితులు గాడితప్పాయి. ఉద్యోగ సంక్షోభం నెలకొందనే కథనాలు వస్తున్నాయి. నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతోందట. ఈ ప్రభావం ప్రధానంగా భారతీయ విద్యార్థులపైనే పడుతోంది. చాలామందికి పార్ట్ టైమ్ జాబ్ లు దొరకడం కష్టం అవుతోంది. ఒకరైతే ఆరు నెలల నుంచి పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లు చెప్పారు. 8 ఏళ్ల క్రితం వచ్చిన తాను.. అప్పట్లో రెండు వారాల్లోనే పార్ట్ టైమ్ జాబ్ పొందానని.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. కెనడా రావాలనుకుంటున్న విద్యార్థులు మరోసారి ఆలోచించాలని కోరుతున్నారు.