Begin typing your search above and press return to search.

ఆ దేశంలో భారతీయ విద్యార్థుల కోపానికి కారణమేంటి? ఎందుకీ నిరసనలు!

అయితే ఇటీవల ఆస్ట్రేలియాకు వివిధ దేశాల నుంచి వలసలు ఎక్కువ కావడంతో ఆ దేశం వీసా పరిమితులను విధించింది.

By:  Tupaki Desk   |   11 Sep 2024 4:58 AM GMT
ఆ దేశంలో భారతీయ విద్యార్థుల కోపానికి కారణమేంటి? ఎందుకీ నిరసనలు!
X

భారతీయ విద్యార్థులు విదేశీ విద్య కోసం వెళ్లే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. అమెరికా, యూకే తర్వాత ఆస్ట్రేలియా.. భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు మూడో గమ్యస్థానంగా నిలుస్తోంది. ఆ దేశంలో దాదాపు 1,70,000 మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ కంట్రీ కావడం, అత్యధిక సంఖ్యలో విదేశీ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు, అత్యున్నత ఉద్యోగావకాశాలు, మంచి జీతభత్యాలు, శాశ్వత నివాసం పొందే అవకాశం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి కావడం వంటి కారణాలతో ఆస్ట్రేలియాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది.

అయితే ఇటీవల ఆస్ట్రేలియాకు వివిధ దేశాల నుంచి వలసలు ఎక్కువ కావడంతో ఆ దేశం వీసా పరిమితులను విధించింది. అలాగే శాశ్వత నివాసం పొందడానికి నిబంధనలను కఠినతరం చేసింది. ఆస్ట్రేలియాలో అత్యధిక సంఖ్యలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు భారతీయులే. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారీగా నష్టపోతోంది.. భారతీయ విద్యార్థులే.

ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విదేశీ విద్య కోసం స్టూడెంట్‌ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు తమ చదువులు ముగియగానే ఆ దేశంలో నివాసం ఉండటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో శాశ్వత నివాసానికి దరఖాస్తులు కూడా చేసుకున్నారు.

అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ శాశ్వత నివాసానికి సంబంధించి పరిమితులు విధించడం భారతీయ విద్యార్థులను దెబ్బకొట్టింది. విదేశీ విద్యార్థులు ఎవరైనా తమ చదువు ముగియగానే ఆస్ట్రేలియాను వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు నిరసనలకు దిగారు. ఆస్ట్రేలియాలో ప్రముఖ నగరాల్లో ఒకటైన పెర్త్‌ లో నిరసనలు మిన్నంటాయి.

శాశ్వత వీసా కోసం 12 ఏళ్లపాటు వేచి ఉన్న తమిళ వ్యక్తి మనో యోగలింగం గత నెలలో మెల్‌ బోర్న్‌ నగరంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత విషమించింది.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వచ్చినవారు తమ తాత్కాలిక బ్రిడ్జింగ్‌ వీసాల పరిమితుల నుండి తప్పించుకోవడానికి శాశ్వత నివాసం కావాలని డిమాండ్‌ చేస్తూ లేబర్‌ పార్టీ ఎంపీ సామ్‌ లిమ్‌ కార్యాలయం బయట నిరసన ప్రదర్శనలకు దిగారు. తమ వీసాలను నిరంతరం పునరుద్ధరిస్తూ ఉండాలని డిమాండ్‌ చేశారు.

ఆస్ట్రేలియాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన మెల్‌ బోర్న్‌ లోనూ నిరసనలు మిన్నంటాయి. ఒక నెలకు పైగా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్‌ కార్యాలయం బయట ఆందోళనకారులు నిరసన దీక్షకు దిగారు.

ఆస్ట్రేలియా వ్యాప్తంగా 500 మందికి పైగా ఆగస్టు 31న సిడ్నీలో ర్యాలీ నిర్వహించారు. ఆస్ట్రేలియాలో ఉంటున్నవారికి మెరుగైన రక్షణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పని, ప్రాథమిక హక్కులు కల్పించాలని కోరారు. మరి ఈ నిరసనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.