బ్రేకింగ్.. చికాగోలో 40 మంది భారతీయ విద్యార్థుల బహిష్కరణ!
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jan 2025 7:19 AM GMTఅమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే.. శతాబ్ధ కాలానికిపైగా అమలులో ఉన్న బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను రద్దు చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై భారతీయ-అమెరికన్స్ సమాజంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
ఆ షాక్ పై చర్చలు విపరీతంగా జరుగుతున్న ఈ సమయంలో.. చికాగో నుంచి ఓ షాకింగ్ కం బ్రేకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అయితే... దీనికీ డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయాలకూ సంబంధం లేనప్పటికీ.. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటలకే ఇలాంటి పరిణామం చోటు చేసుకొవడం గమనార్హం. అదే.. భారతీయ విద్యార్థుల బహిష్కరణ!
అవును... అమెరికాలోని భారతీయ విద్యార్థులకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. సుమారు 40 మంది భారతీయ విద్యార్థులు బహిష్కరించబడ్డారని అంటున్నారు. చికాగోలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించారని.. దీంతో వీరిపై బహిష్కరణ వేటు పడిందని తెలుస్తోంది.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆ విద్యార్థులు ఏయే రాష్ట్రాలకు చెందినవారు.. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎవరైనా ఉన్నారా.. మొదలైన విషయాలు తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఇండియన్ స్టూడెంట్స్ కమ్యునిటీలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో... డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ఒకటి ఆయన ప్రమేయంతో, మరొకటి ఆయన ప్రమేయం లేకుండా భారతీయ సమాజానికి వరుస దెబ్బలు తగిలినట్లయ్యిందనే చర్చ తెరపైకి వచ్చింది.
కాగా... అమెరికాలో రోజువారీ ఖర్చులు పెరిగిపోతుండటంతో చాలా మంది విదేశీ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారని.. వీరిలో కొంతమంది పెట్రోల్ బంకుల్లో, హోటల్స్ లో, సూపర్ మార్కెట్స్ లో పని చేస్తుంటే.. మరికొంతమంది అమ్మాయిలు ఆయాలుగా పనిచేస్తున్నారంటూ 'ఓపెన్ డోర్స్ - 2024' సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే.