ఆ దేశంలో మరో దారుణం.. ముగ్గురు భారతీయ విద్యార్థులు..!
అమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.
By: Tupaki Desk | 22 May 2024 8:28 AM GMTఅమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. వరుసగా వివిధ ప్రమాదాల్లో లేదా హత్యలకు గురై భారతీయులు మృతి చెందుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది భారతీయులకు అసలు అచ్చిరాలేదు. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే అమెరికాలో వరుసగా భారతీయులు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.
ఏప్రిల్ లో ఫ్లోరిడాలోని ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న పిట్టల వెంకటరమణ, కృష్ణా జిల్లాకు చెందిన తల్లీకూతురు గీతాంజలి, హానిక, బాపట్ల జిల్లా విద్యార్థి ఆచంట రేవంత్, మరో తెలుగు విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె వేర్వేరు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.
తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మరణించారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ అమెరికన్ విద్యార్థులు.. శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మ మృతి చెందారు. మరో ఇద్దరు.. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ తీవ్రంగా గాయపడ్డారు. వీరు అల్ఫారెట్టాలోని నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్ విద్యార్థులనీ పోలీసులు వెల్లడించారు.
ఈ ఐదుగురు విద్యార్థులు కారులో ఉన్నారని.. అతివేగంగా వస్తూ చెట్టుకు ఢీకొట్టారని పోలీసులు తెలిపారు. ఈ దారుణ దుర్ఘటనలో ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మరణించారని వెల్లడించారు. అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది.
కాగా మరణించిన ముగ్గురు విద్యార్థులు మంచి ప్రతిభావంతులని తెలుస్తోంది. శ్రీయా.. డ్యాన్సర్. ఆమె డ్యాన్సర్ గా ఉన్న షికారి గ్రూప్ దీనిపై సంతాపం వ్యక్తం చేసింది. ఆర్యన్ జోషి క్రికెటర్ గా రాణిస్తున్నాడు. అతడి మరణం తీరని లోటని ఆల్ఫారెట్టా హై క్రికెట్ జట్టు సంతాపం తెలిపింది. ఇక అన్వీ శర్మ సింగర్ అని సమాచారం. అన్వీశర్మ మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని కళాకార్ గ్రూప్ తమ సంతాప ప్రకటనలో వెల్లడించింది.
ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు పలు కారణాలతో మృత్యువాత పడటంతో ఆవేదన వ్యక్తమవుతోంది. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువత ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో వారి కుటుంబాలు శోక సంద్రంలో మునిగి తేలుతున్నాయి.