అమెరికాలో అరకోటి.. అన్నింట్లోనూ భారతీయులు మహా మేటి
అమెరికాను ఇప్పుడంటే అగ్ర రాజ్యం అంటున్నారు.
By: Tupaki Desk | 21 Aug 2024 5:30 PM GMTఅమెరికా అంటే అందరికీ కలల దేశం.. పక్కనున్న మెక్సికో నుంచి ఎక్కడో ఉన్న జపాన్ వరకు అమెరికా అంటే మహా మోజు.. అందులోనూ అగ్ర రాజ్యంగా మారిన అమెరికా చెప్పినదే నేడు శాసనం. ఆర్థికంగా అత్యంత బలమైన శక్తిగా ఎదిగిన అమెరికాలో మరి భారతీయుల పాత్ర లేకుండా ఉంటుందా..? ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ.. భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లడం మాత్రం ఓ వందేళ్ల కిందట నుంచి ఉందనుకోవచ్చు. ఈ క్రమంలోనే భారతీయుల జనాభా అగ్రరాజ్యంలో అరకోటికి చేరింది.
అగ్ర రాజ్యంగా మారకముందే..
అమెరికాను ఇప్పుడంటే అగ్ర రాజ్యం అంటున్నారు. కానీ, ఈ స్థాయికి రావడానికి ముందే.. అంటే అమెరికాకు పోటీగా దీటైన సోవియట్ రష్యా ఉన్నప్పుడే మనవాళ్లు ఆ దేశం బాట పట్టారు. అంటే.. అమెరికా అగ్ర రాజ్యంగా ఎదుగుతున్న క్రమంలో మనవాళ్లు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అలా అక్కడ మొదలై ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి ఓ భారత సంతతి మహిళ పోటీ పడే స్థాయికి చేరారు. ఎంతైనా ఇది విశేషమే కదా..? ఇక ఈ ఏడాది చివరలో జరగనున్న అమెరికా ఎన్నికల సందర్భంగా అక్కడి భారతీలయు ప్రగతిని చాటే నివేదికను ‘ఇండియాస్పోరా’ సంస్థ వెల్లడించింది. దీనికి ‘చిన్న జాతి.. పెద్ద సహకారం.. అవధుల్లేని ప్రగతి: అమెరికాలో భారతీయులు (స్మాల్ కమ్యూనిటీ.. బిగ్ కాంట్రిబ్యూషన్స్.. బౌండ్ లెస్ హొరైజన్స్): ద ఇండియన్ డయాస్పోరా ఇన్ అమెరికా’ అనే పేరు పెట్టింది. దాని ప్రకారం..
-అమెరికాలో భారతీయులు/భారతీయ సంతతివారు 51 లక్షల మంది ఉన్నారు. మొత్తం దేశ జనాభాలో వీరు ఒకటిన్నర శాతం.
- 51 లక్షలమందిలో 22 లక్షల మంది వరకు 2010 తర్వాత వెళ్లినవారే. మిగిలిన వారిలో 30 శాతం మంది వై2కె అంటే.. 2000 కంటే ముందు వెళ్లారు.
- మిగిలిన 25 శాతంలో కొందరు ఇటీవలే వెళ్లగా.. మిగతావారు అక్కడే పుట్టినవారు.
- అమెరికాలో భారతీయులు అత్యధికంగా నివసించే రాష్ట్రాలు న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్
- ప్రైవేటు వ్యక్తులు స్థాపించిన స్టార్టప్ లు అంటే.. యూనికార్న్ స్టార్టప్ లు. అమెరికాలో ఇలాంటివి 648 ఉన్నాయి. వీటిలో 72 భారత్ నుంచి వలస వెళ్లినవారు స్థాపించినవే. వీటి విలువ 195 బిలియన్ డాలర్లు (రూ.16.38 లక్షల కోట్లు). ఇక వీటిలో 55 వేల మంది పనిచేస్తున్నారు. యూనికార్న్ స్టార్టప్ ల ఉద్యోగుల్లో ఇది 13 శాతంతో సమానం.
ఆతిథ్యంలో మేటి..
భారతీయులు అంటేనే అతిథులను గౌరవించేవారు. ఆతిథ్యం రంగంలో పేరుమోసినవారు. ఇది అమెరికాలోనూ కొనసాగిస్తున్నారు. అక్కడి 60 శాతం హోటళ్లను భారతీయ అమెరికన్లే నిర్వహిస్తున్నారు. వీటి సంత్సరానికి 700 బిలియన్ డాలర్ల (రూ.58.8 లక్షల కోట్లు) వ్యాపారం జరుగుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మందికి ఉపాధి దొరుకుతోంది. ఇక హోటళ్లు మనవాళ్లే నడుపుతుంటే.. కిరాణం దుకాణాలు మనవి కాకుండా పోతాయా? అగ్ర రాజ్యంలో 35% నుంచి 50% దాకా గ్రాసరీ స్టోర్లు భారతీయ అమెరికన్లవే. వీటి ద్వారా ఏటా 350 బిలియన్ డాలర్ల (రూ.29.4 లక్షల కోట్లు) నుంచి 490 బిలియన్ డాలర్ల (రూ.41.16 లక్షల కోట్లు) వ్యాపారం జరుగుతోంది.
దానంలో పోటీ
భారతీయ అమెరికన్లు ఏటా 300 బిలియన్ డాలర్ల (రూ.25.2 లక్షల కోట్లు) పన్ను కడుతున్నారు. 370 బిలియన్ డాలర్ల (రూ.31.08 లక్షల కోట్లు) నుంచి 460 బిలియన్ డాలర్లను (రూ.38.64 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. అమ్మకం పన్ను రూపంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అతి పెద్ద చోదక శక్తి. 2023లో ప్రచురితమైన సైన్స్ జర్నల్స్ లోని 13 శాతం వ్యాసాల్లో భారతీయ అమెరికన్లు సహ రచయితలు. అక్కడి 50 టాప్ కాలేజీల్లో 35 చోట్ల భారతీయ అమెరికన్లే సారథులు. 25 ఏళ్లలో 34 మంది స్పెల్ బీ విజేతలుకాగా వీరిలో 28 మంది భారతీయ అమెరికన్లే. 2008 నుంచి అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు భారతీయ అమెరికన్లు 3 బిలియన్ డాలర్లను (రూ.25,200 కోట్లు) విరాళమిచ్చారు. మనవాళ్లు ఏటా ఇచ్చే విరాళాలు 2 బిలియన్ డాలర్లు (రూ.16,88 కోట్లు) అంటే ఆశ్చర్యపోవాల్సిందే.