డాక్టర్ చదివి క్యాబ్ డ్రైవర్ గా ఇండియన్ స్టూడెంట్స్...!
తాజా పరిస్థితుల నేపథ్యంలో టొరంటో దాని చుట్టుపక్కల నగరాల్లో ఉండే అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు భారతీయ విద్యార్థులకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయని తెలుస్తుంది.
By: Tupaki Desk | 10 Oct 2023 2:30 AM GMTగతకొన్ని రోజులుగా కెనడా - భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు దౌత్యకార్యాలయాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో అక్కడున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారిపోయిందని అంటున్నారు. ఈ సమయంలో ఉద్యోగాలు దొరక్క పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం అనే మాటలు వినిపిస్తున్నాయి.
అవును... కెనడా - భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ విద్యార్థులకు అక్కడ ఉద్యోగావకాశాలు దొరకడంలేదని తెలుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ తీవ్రమైన ఉద్యోగాల కొరత నెలకొందని అంటున్నారు. దీంతో అక్కడున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనలకు లోనవుతున్నారని సమాచారం.
తాజా పరిస్థితుల నేపథ్యంలో టొరంటో దాని చుట్టుపక్కల నగరాల్లో ఉండే అత్యధిక జీవన వ్యయ పరిస్థితులు భారతీయ విద్యార్థులకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయని తెలుస్తుంది. దీంతో ఎక్కువ మంది నెలవారీ ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు తగ్గించుకునేందుకు ఇరుకైన గదుల్లో కాలం గడుపుతున్నారట. మరోపక్క బ్రతకడానికి వారు ఎంచుకుంటున్న ఆదాయ మార్గాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.
ఇందులో భాగంగా... భారత్ - కెనడాల మధ్య చోటుచేసుకున్న పరిణామాల కంటే తమ భవిష్యత్తు మీదే అత్యంత ఆందోళన నెలకొందని చెబుతున్న భారతీయ విద్యార్థులు... ఉన్నత చదువులు పూర్తయ్యేసరికి ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియడంలేదని చెబుతున్నారు.
ఇదే సమయంలో వైద్య పట్టాలు పొందిన పలువురు భారతీయ విద్యార్థుల పరిస్థితి సైతం అత్యంత దుర్భరంగా ఉందని సమాచారం. వారికి కూడా మంచి జీతాలిచ్చే ఉద్యోగాలు దొరకడంలేదట. దీంతో అనేక మంది క్యాబ్ లు నడుపుతుంటే... మరికొంతమంద్ షాపుల్లోనూ, రెస్టారెంట్లలోనూ అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నారంట.
మరి ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయి.. అక్కడ విద్య పూర్తయ్యే నాటికైనా పరిస్థితులు చక్కబడతాయా అనే ఆందోళన భారతీయ విద్యార్థుల్లో నెలకొందని తెలుస్తుంది.
మరోపక్క ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కయ్యానికి కాలుదువ్విన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పద్దతి ఇంకా మారలేదు. ఈ క్రమంలో ఆయన భారత్ పై మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా... "భారత్ - కెనడా దౌత్య వివాదం గురించి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ తో చర్చించినట్లు స్వయంగా వెల్లడించారు.