ప్రపంచ బ్యాంకులో తెలుగమ్మాయి... డ్యూటీ ప్రత్యేకత ఇదే!
అవును... కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్ సత్యన్నారాయణ, గృహిని మాధవి ల కూత్గురు కిలారు ఇందు.
By: Tupaki Desk | 15 Aug 2023 12:08 PM GMTఅనుకున్నది సాధించాలంటే కష్టపడే మనస్తత్వం ఉండటంతోపాటు పట్టుదల ఉండాలి అని అంటారు. ఇవి రెండూ పుష్కలంగా ఉండటంతో ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.. చిన్నతనం నుంచి చదువుల్లో రాణిస్తూ పట్టుదలతో కష్టపడితే అనుకున్నది సాధించొచ్చని నిరూపించింది ఓ తెలుగమ్మాయి.
అవును... కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన గెస్ట్ లెక్చరర్ సత్యన్నారాయణ, గృహిని మాధవి ల కూత్గురు కిలారు ఇందు. వీరిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. విజయవాడలో బీటెక్ పూర్తి చేసిన ఇందు.. అనంతరం ఎంఎస్ కోసం అమెరికా వెళ్లింది.
అమెరికాలో ఎంఎస్ పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేయాలని భావించిన ఇందు... తాను ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారట. దీంతో... యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ – మేసన్ లో.. ఎంఎస్, పబ్లిక్ పాలసీ కోర్సులో చేరారు.
అనంతరం ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సంపాదించారు. ఈ ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను నిర్వహించనున్నారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా.. అలాగే వివిధ దేశాలలో వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం, తేడాలను విశ్లేషించడంపై బాధ్యతలు ఈమెకు ఇచ్చారు.
వీటిపై రిపోర్టులు తయారు చేయడం.. ఎంవోయూలు చేసుకోవడం.. సమావేశాల్లో చర్చించడం వంటివి చేయాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఇందుకు ప్రత్యేకంగా ఈమెకు జీ4 వీసా ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగంలో చేరాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి.
కాగా... ఎంఎస్ లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ.65 లక్షలు స్కాలర్ షిప్ ఈమె అందుకున్నారు. దీంతోపాటు... ఔట్ స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్ గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ఫ్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ పురస్కారాలు ఈమెను వరించడం గమనార్హం!