Begin typing your search above and press return to search.

యూకేదీ ట్రంప్ బాటే.. 600 మంది అరెస్టు.. స్వదేశాలకు పంపే యోచన

ఈ ప్రభావం మెక్సికో వంటి పొరుగు దేశాలపైనే కాదు ఎక్కడో సుదూరాన ఉన్న భారత దేశంపైనా పడడం గమనార్హం.

By:  Tupaki Desk   |   10 Feb 2025 3:47 PM GMT
యూకేదీ ట్రంప్ బాటే.. 600 మంది అరెస్టు.. స్వదేశాలకు పంపే యోచన
X

అక్రమ వలసదారులు.. ఏ దేశంలోనైనా సమస్యే. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికా ఈ సమస్య హెడ్ లైన్లలో నిలుస్తోంది. అన్నంతపనీ చేసే ట్రంప్.. తమ దేశంలో సరైన ధ్రువపత్రాలు, అనుమతులు లేకుండా ఉంటున్నవారిని వెళ్లగొట్టే కార్యక్రమం చేపట్టారు. చరిత్రలోనే అత్యంత భారీ డిపోర్టేషన్ కు దిగారు. ఈ ప్రభావం మెక్సికో వంటి పొరుగు దేశాలపైనే కాదు ఎక్కడో సుదూరాన ఉన్న భారత దేశంపైనా పడడం గమనార్హం.

అమెరికా తరహాలోనే ప్రపంచంలో వలసల తాకిడి ఎక్కువగా ఉండే దేశం బ్రిటన్. ఓవిధంగా చెప్పాలంటే మొత్తం యూరప్ అంతా ఇంతే. ఆఫ్రికా ఖండం నుంచి ఫ్రాన్స్ తదితర దేశాలకు వలసలు అధికంగా ఉంటాయి. ఆ మధ్య కొందరు కంటైనర్లలో యూరప్ నకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైన వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అమెరికా అక్రమ వలసదారులను వెళ్లగొడుతున్న రీతిలోనే యూకే కూడా కీలక చర్యలు చేపట్టింది. గత నెల తమ దేశంలో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 600 మందిని అరెస్టు చేసింది.

తమ ఆప్త మిత్ర దేశమైన అమెరికాను చూసి నేర్చుకుందో ఏమో..? అక్రమ వలసలపై బ్రిటన్ వైఖరి మారింది. దీనిని సూచిస్తూ యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ స్పందించారు. అక్రమ వలసలకు ముగింపు పలుకుతామని హెచ్చరించారు.

దేశానికి అక్రమ వలసలు పెరిగాయని.. చాలామంది ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారని అన్నారు. ఈ చట్ట వ్యతిరేక వలసలను ముగిస్తామని ట్వీట్ చేశారు.

2024 జూలైలో కీర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన సారథ్యంలోని లేబర్ పార్టీ అప్పటినుంచే సరిహద్దుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. జనవరిలో ఇమ్మిగ్రేషన్‌ విభాగం.. వందలాది అక్రమ పనివారిని అరెస్టు చేసింది. వీరంతా సరైన అనుమతుల్లేకుండా యూకేలో అడుగుపెట్టి.. బార్లు, రెస్టారెంట్లు, కార్‌ వాషింగ్‌ కేంద్రాలు, స్టోర్లలో పనిచేసేవారే.

828 ప్రాంగణాల్లో తనిఖీలతో 609 మందిని అరెస్టు చేశారు. అయితే, జూలై నుంచి 4 వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యూకే హోంశాఖ చెబుతోంది. ఉద్యోగాల పేరిట వీరిని నేరగాళ్ల ముఠాలు ప్రమాదకర పద్ధతుల్లో యూకే తీసుకొచ్చినట్లు సమాచారం. ఇంకొందరైతే ఇంగ్లిష్‌ ఛానల్‌ ను ఈది మరీ వచ్చారట. అరెస్టు చేసినవారిని స్వదేశాలకు తిప్పి పంపడంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అక్రమ వలసలను అడ్డుకోవడం, సరిహద్దు రక్షణ, శరణార్థుల బిల్లుపై యూకే పార్లమెంటులో చర్చ జరగనుంది.