Begin typing your search above and press return to search.

ఎన్నారైలకు పాన్ విషయంలో ఐటీ శాఖ కీలక సూచన!

ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా

By:  Tupaki Desk   |   19 July 2023 4:15 AM GMT
ఎన్నారైలకు పాన్ విషయంలో ఐటీ శాఖ కీలక సూచన!
X

ఎన్నారైలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆధార్ అనుసంధానించక పోవడం వల్ల పాన్ చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని సూచించింది.

అవును... పలువురు ఎన్నారైలు తమ పాన్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఐటీశాఖ కీలక సూచన చేసిందని తెలుతుంది. ఈ మేరకు ఆన్ లైన్ వేదికగా ఈ విషయాలు వెళ్లడించింది. పాన్‌ కార్డు నిరుపయోగంగా మారినంత మాత్రన పాన్‌ పూర్తిగా క్రియాశీలంగా లేనట్లు కాదని ఐటీ శాఖ పేర్కొంది.

ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాలు వారి పాన్ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. అయితే ఎన్నారైలు గత మూడు మదింపు సంవత్సరాల్లో ఏదైనా ఏడాది రిటర్నులు దాఖలు చేయకపోయినా, లేదా వారి నివాస స్థితిని తెలియజేయకపోయినా వారి పాన్‌ నిరుపయోగంగా మారినట్లు ఐటీ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా... కొందరి పాన్ కార్డులు ఎందుకు పనిచేయవన్న దానికి గల కారణాలు వివరించింది.

గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన ఎన్నారైల నివాస స్థితిని ఐటీ విభాగం గుర్తిస్తుంది. తమ నివాస స్థితిని ఎన్నారైలు జ్యూరిస్ డిక్షనల్ అడ్రెసింగ్ ఆఫీసర్ కు తెలియజేసినా, ఆ విషయాన్ని కూడా ఐటీ విభాగం పరిగణనలోకి తీసుకుందని అంటున్నారు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా, వారి పాన్ కార్డులు పనిచేయవని సూచించింది.

అలాంటి వారు వెంటనే తమ ప్రస్తుత నివాస స్థితిని సంబంధింత జ్యూరిస్ డిక్షనల్ అడ్రెసింగ్ ఆఫీసర్ కు తెలియజేయాలి. పాన్ కార్డు డేటాబేస్ లో తమ నివాస స్థితిని అప్ డేట్ చేయాలన్న అభ్యర్థనతో పాటు, అందుకు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాలని సూచించింది.

ఇదే సమయంలో పాన్ కార్డు పనిచేయకపోవడం అంటే, ఇక ఆ పాన్ కార్డు ఎప్పటికీ పనికిరాదని భావించరాదని సూచించిన ఐటీ శాఖ... పాన్ కార్డు పనిచేయకపోయినా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చని తెలిపింది. కాకపోతే పెండింగ్‌ రిఫండ్లు, రిఫండ్లపై వడ్డీ వంటివి రావని మరోసారి స్పష్టం చేసింది. అదే సమయంలో డీఎస్‌, టీఎసీఎస్‌ ఎక్కువ మొత్తంలో డిడక్ట్‌ అవుతాయని తెలిపింది.