అమెరికాలో మరో ‘జయ్’కేతనం..నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్
తాజాగా అమెరికాలో భారత సంతతి వ్యక్తి మరో ఉన్నత పదవి పొందారు. అగ్రరాజ్యంలో బాగా డిమాండ్ ఉండేది హెల్త్ కేర్ రంగం.
By: Tupaki Desk | 26 March 2025 10:56 AMఅక్షరాలా అరకోటి.. అమెరికాలో భారత సంతతి జనాభా ఇది. వీరేకాక భారతీయ మూలాలున్న వారు లెక్కలేనంత మంది.. వీరిలో ఉన్నత హోదాల్లో ఉన్నవారూ చాలమంది.. అగ్ర రాజ్యం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ నుంచి ప్రసిద్ధ వ్యోమగామి సునీతా విలియమ్స్ వరకు.. భారతీయులు రాణించని రంగం అంటూ అమెరికాలో లేదు. టెక్ ప్రపంచాన్ని శాసించే గూగుల్ అధిపతి సుందర్ పిచయ్.. ట్రంప్ చేపట్టిన అధికార వ్యవస్థ ప్రక్షాళన డోజ్ లో వివేక్ రామస్వామి వరకు.. అగ్రరాజ్యంలో భారతీయుల హవా మామూలుగా లేదు.
తాజాగా అమెరికాలో భారత సంతతి వ్యక్తి మరో ఉన్నత పదవి పొందారు. అగ్రరాజ్యంలో బాగా డిమాండ్ ఉండేది హెల్త్ కేర్ రంగం. ఇప్పుడు భారత మూలాలున్న జయ్ భట్టాచార్యకు ఈ రంగంలో ఉన్నత పదవి దక్కింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా భట్టాచార్య ఎన్నికైనట్లు యూఎస్ సెనెట్ ధ్రువీకరించింది.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్ గా జయ్ భట్టాచార్య వ్యవహరించనున్నారు. ఇది వైద్య పరిశోధనలను పర్యవేక్షించే సంస్థ. ఇప్పటికే నవంబరులోనే ట్రంప్ ప్రకటన చేశారు.
ట్రంప్ ప్రకటనపై భట్టాచార్య స్పందించారు. తనను తదుపరి ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తామని ప్రకటించారు.
భట్టాచార్య 1968లో కోల్ కతాలో జన్మించారు. 1997లో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో డాక్టరేట్ పొందారు. మూడేళ్ల తర్వాత అక్కడే ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ అందుకున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ లో రీసెర్చ్ అసోసియేట్ గా విధులు నిర్వహించారు.
అమెరికాను కుదిపేసిన కొవిడ్ సమయంలో అప్పటి బైడైన్ ప్రభుత్వ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఇద్దరు విద్యావేత్తలతో కలిసి గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్ ను ప్రచురించారు.
ట్రంప్ ప్రభుత్వంలో 71 ఏళ్ల రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్.. ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. ఈయన మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ వారసుడు. కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన రాబర్ట్ తో కలిసి జయ్ భట్టాచార్య పనిచేయాల్సి ఉంటుంది.