'సీఐఏ' నెక్స్ట్ చీఫ్ గా భారతీయ మూలాలున్న వ్యక్తి.. ఎవరీ కశ్యప్ పటేల్?
ఈ సమయంలో ట్రంప్.. తన మంత్రివర్గం కోసం ఉన్నతస్థాయి పరిపాలన అధికారులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 7 Nov 2024 5:27 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ని ఓడించి.. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే! తనదైన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో స్వింగ్ స్టేట్స్ లోనూ అతని బలమైన ప్రదర్శన మ్యాజిక్ ఫిగర్ (270) ని ఈజీగా దాటేసిందని అంటున్నారు.
ఈ సమయంలో ట్రంప్.. తన మంత్రివర్గం కోసం ఉన్నతస్థాయి పరిపాలన అధికారులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో ఉనంత ర్యాకింగ్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని.. సీఐఏ చీఫ్ గా భారతీయ మూలాలున్న వ్యక్తిని ఫైనల్ చేస్తారన్ని అంటున్నారు.
అవును... ప్రపంచంలోనే అత్యంత రహస్యమయ నిఘా సంస్థ అయిన అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) అధిపతిగా భారతీయ మూలాలున్న వ్యక్తి కశ్యప్ పటేల్ ను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం ఊపందుకొంది. పైగా... కశ్యప్ కు డొనాల్డ్ ట్రంప్ కు వీరవిధేయుడిగా పేరుందని చెబుతారు.
ఎవరీ కశ్యప్ పటేల్?:
కశ్యప్ కుటుంబమూలాలు భారత్ లోని గుజరాత్ లో ఉన్నాయి. అతడి తల్లితండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఈ క్రమంలో... అతడి తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలసవచ్చారు. ఈ నేపథ్యంలో... 1980లో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో కశ్యప్ పటేల్ జన్మించారు.
ఈ క్రమంలో...యూనివర్శిటీ ఆఫ్ రిచ్ మండ్ లో గ్రాడ్యుయేషన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ లో లా విద్యను పూర్తి చేశారు. అనంతరం.. మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్ గా పనిచేశారు. అనంతరం జస్టిస్ డిపార్ట్ మెంట్ లోనూ చేరారు. ఈ క్రమంలోనే ఆయన్ను ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కోసం పనిచేసేందుకు నియమించారు.
పటేల్... డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో టెర్రరిజం ప్రాసిక్యూటర్ గా చేరి.. ఆల్-ఖైదా, ఐ.ఎస్.ఐ.ఎస్. వంటి గ్రూపులతో సంబంధం ఉన్న వ్యక్తులపై పరిశోధనలు, ప్రాసిక్యూషన్ లకు నాయకత్వం వహించారు. ఇదే క్రమంలో... గ్లోబల్ టెర్రరిజం కార్యకలాపాలపై సహకరిస్తూ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కి న్యాయశాఖ లైజన్ ఆఫీసర్ గా కూడా పనిచేశాడు.
తర్వాత సుమారు 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీలను పర్యవేక్షిస్తూ, ప్రెసిడెంట్ డైలీ బ్రీఫింగ్ ను అందజేస్తూ, నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్ కు ప్రిన్సిపల్ డిప్యూటీగా నియమించబడ్డారు. 2019 ఫిబ్రవరిలో జాతీయ భద్రతా మండలి (ఎన్.ఎస్.సీ)లో సిబ్బందిగా చేరి.. తర్వాత తీవ్రవాద నిరోధక డైరెక్టరేట్ సీనియర్ డైరెక్టర్ అయ్యారు.