Begin typing your search above and press return to search.

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి... ఇంటివద్ద విషాదఛాయలు!

అవును... అమెరికాలో చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్న పుచ్చా వరుణ్‌ రాజ్‌ (29) మృతి చెందాడు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 7:00 AM GMT
అమెరికాలో ఖమ్మం  విద్యార్థి  మృతి... ఇంటివద్ద విషాదఛాయలు!
X

అమెరికాలో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు తాజాగా సమాచారం అందింది. దీంతో వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కత్తిపోట్లకు గురైన అనంతరం వరుణ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు! నాటి నుంచీ వైద్యులు శస్త్రచికిత్స చేసి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ యువకుడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.

అవును... అమెరికాలో చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్న పుచ్చా వరుణ్‌ రాజ్‌ (29) మృతి చెందాడు. ఇండియానా రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీలో వరుణ్ రాజ్ ఎంఎస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 30న వాల్‌ పరైసో లోని ప్లానెట్ ఫిట్‌ నెస్‌ జిం నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు వరుణ్ పై కత్తితో కణతపై పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వరుణ్ ను పోలీసులు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.

నాటి నుంచీ వరుణ్ అపస్మారక స్థితిలో ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఈ దాడి జరిగిన మూడు రోజుల తర్వాత ఈ ఘటనపై అమెరికా స్పందించింది. ఇందులో భాగంగా... తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో... నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. ఈ ఘటన అత్యంత బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వరుణ్ సురక్షితంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.

వాస్తవానికి నాలుగు రోజుల క్రితం వరుణ్ ఆరోగ్య పరిస్థితిపై లూథరన్‌ ఆసుపత్రి వైద్యులు స్పందించారని వార్తలొచ్చాయి. ఇందులో భాగంగా... అతడు ఇంకా కోమాలోనే ఉన్నాడని.. ప్రస్తుతం లైఫ్‌ సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు! అయితే... తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడిందని, దీంతో ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు!

ఈ సమయంలో వరుణ్‌ రాజ్‌ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం "గో ఫండ్‌"లో విరాళాల సేకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా 2,50,000 డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది! ఈ సమయంలో... వరుణ్ రాజ్ మృతిచెందాడనే చేదు వార్త కుటుంబ సభ్యులకు అందింది! దీంతో వరుణ్‌ ఇంటివద్ద విషాదఛాయలు అలముకున్నాయి.

కాగా... ఈ దారుణ సంఘటన గురించి తెలిసిన అనంతరం మహబూబాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వరుణ్‌ రాజ్‌ తండ్రి రామ్మూర్తి.. మంత్రి పువ్వాడ అజయ్‌ ను కలిసిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని ఆయన మంత్రిని కోరారు. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు!