రాముని ప్రతిష్ట వేడుక... ఎన్నారైల వీసాలు తక్షణం రద్దు!
దీంతో దేశం నలుమూలల నుంచీ సరాసరిన రోజుకు 4 - 5 లక్షల మంది అయోధ్యకు పయణమవుతున్నారని అంటున్నారు
By: Tupaki Desk | 26 Jan 2024 7:05 AM GMTసుమారు 500 ఏళ్లనాటి వివాదానికి తెరదించుతూ.. కేంద్రంలోని మోడీ సర్కారు అయోధ్య రామాలయం నిర్మించడం, అందులోని గర్భగుడిలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వేల మంది ప్రత్యక్షంగా.. కోట్ల మంది పరోక్షంగా తిలకించారు! ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటిరోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
దీంతో దేశం నలుమూలల నుంచీ సరాసరిన రోజుకు 4 - 5 లక్షల మంది అయోధ్యకు పయణమవుతున్నారని అంటున్నారు. ఇక ఈ నెల 22న జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రోడ్లపైకి వచ్చి, శ్రీరాముని బొమ్మలతో ఉన్న జెండాలు చేతపట్టి... "జై శ్రీరాం" నినాదాలతో వీదుల్లో హోరెత్తించేశారు. దీంతో కొంతమంది ఎన్నారైల జాబ్స్ పోయాయి!
అవును... అయోధ్యలో బాలరామయ్య ప్రతిష్టాపన సందర్భంగా తాము పనిచేస్తున్న దేశంలో కూడా సెలబ్రేషన్స్ చేసుకున్నారు భారతీయులు. ఇందులో భాగంగా... శ్రీరామనామ స్మరణతో పాటు.. “భారత్ మాతాకి జై” అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ విషయాన్ని ఆ దేశం సీరియస్ గా తీసుకుంది.. వీరి వీసాలను తక్షణం రద్దుచేసింది. రాత్రికి రాత్రి విమానం ఎక్కించి భారత్ కు పంపించేసింది.
వివరాళ్లోకి వెళ్తే... కువైట్ లోని ఒక ప్రముఖ పెట్రో రసాయనాల సంస్థ అనుబంధ విభాగంతో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొంతమంది భారతీయులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో బాలరామయ్య ప్రతిష్టాపన సందర్భంగా మోడీ పిలుపు అందుకున్న వీరంతా.. పని చేస్తున్న ప్రదేశంలో స్వీట్లు పంచిపెడుతూ.. శ్రీరామనామ స్మరణతో పాటు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
దీంతో... వాళ్లను అరెస్ట్ చేసి, వీసాలను రద్దు చేసి దేశం నుండి బహిష్కరించారు. ఇదే సమయంలో... తక్షణమే రాత్రికి రాత్రి విమానంలో భారతదేశానికి పంపించేశారు. తదుపరి విచారణను కొనసాగిస్తామని కూడా వెల్లడించారు. దీంతో వీరంతా ఇప్పుడు భారత్ కు చేరుకున్నారు. వీరిపై భారత ఎంబసీలోనూ ఫిర్యాదులు వచ్చాయని తెలుస్తుంది. ఏది ఏమైనా... ఈ వ్యవహారంలో సుమారు 9 మందికి ఉద్యోగాలు పోయాయి!!