కిర్గిజ్ స్థాన్ లో మన విద్యార్థులు ఎందరు? మెడిసిన్ చదువులకు ఎందుకు వెళతారు?
కిర్గిజ్ స్థాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేలాది కుటుంబాల్లో కొత్త టెన్షన్ ను తెప్పిస్తోంది
By: Tupaki Desk | 19 May 2024 5:29 AM GMTకిర్గిజ్ స్థాన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేలాది కుటుంబాల్లో కొత్త టెన్షన్ ను తెప్పిస్తోంది. దీనికి కారణం.. ఆ దేశంలో విదేశీయులైన భారతీయులు.. పాకిస్థానీయులు.. బంగ్లాదేశీయులే లక్ష్యంగా దాడులు జరగటమే. ఈ దేశంలో వైద్య విద్య చేసేందుకు వేలాది మంది భారత విద్యార్థులు ప్రతి ఏటా వెళుతుంటారు. మన దేశంలో వైద్యవిద్యతో పోలిస్తే.. ఈ దేశంలో తక్కువగా ఉండటం ఒక కారణం. లోకల్ - నాన్ లోకల్ పంచాయితీతో అక్కడ గొడవలు జరగటం.. కిర్గిజ్ స్థాన్ స్థానికులు మనోళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో భారతీయులకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. ఈ దాడుల్లో పాకిస్థానీ విద్యార్థులు ముగ్గురు బలయ్యారన్న సంగతి తెలిసిందే. ఇంతకూ కిర్గిజిస్థాన్ లో మన విద్యార్థులు ఎందరో తెలిస్తే నోట మాట రాదంతే.
ప్రస్తుతం ఆ దేశంలో 15వేల మంది వరకు భారతీయ వైద్య విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరికి తోడుగా వందలాది మంది భారతీయ సిబ్బంది కూడా అక్కడ ఉంటున్నారు. మన చైతన్య.. నారాయణ మాదిరి అక్కడి వైద్య విద్యను ఒక పక్కా బిజినెస్ గా చేశారని చెప్పాలి. మన దేశంలో మెడిసిన్ చేయాలంటే ఏడాదికి కనీసం 20-25 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. అదే.. ఆ దేశంలో అయితే కేవలం రూ.25 లక్షల్లోనే (హాస్టల్.. ఫుడ్ తో సహా) మెడిసిన్ ను పూర్తి చేయొచ్చు.
అందుకే.. మెడిసిన్ చేయాలని బలంగా కాంక్షించే వారు.. ఆ దేశంలో మెడిసిన్ చేస్తుంటారు. అక్కడి ప్రభుత్వంతో మాట్లాడుకున్న కొందరు.. కొన్నేళ్ల క్రితం మెడికిల్ వర్సిటీలు ఏర్పాటు చేసి.. మన చైతన్య.. నారాయణ మాదిరి అన్ని ఏర్పాట్లు చేయటం.. తక్కువ ఖర్చుతో మెడిసిన్ చేసేందుకు అవకాశాలు ఉండటంతో వందలాది మంది ప్రతి ఏడాది ఆ దేశానికి వెళుతుంటారు. దీంతో పాటు జార్జియాకు కూడా పెద్ద ఎత్తున వెళుతుంటారు. కిర్గిజ్ స్థాన్ తో పోలిస్తే జార్జియాలో ఖర్చులు కాస్త ఎక్కువ.
క్లినికల్ శిక్షణతో పాటు ఐదారేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఈ దేశంలో అతి తక్కువ ఖర్చుకావటంతో ఆ దేశంలో మెడిసిన్ చేసేందుకు మొగ్గు చూపే పరిస్థితి. ఇంతకూ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందన్న విషయానికి వస్తే.. భారతీయులు.. ముఖ్యంగా తెలుగోళ్లు ఉన్న ప్రాంతాల్లో గొడవలు జరగట్లేదని చెబుతున్నారు. పరిస్థితి అదుపులో ఉందని.. ప్రతి హాస్టల్ బయట కిర్గిజ్ స్థాన్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. టీవీల్లో వార్తలు చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు.. బంధువులు ఆందోళన చెందుతూ తమ పిల్లలకు ఫోన్లు చేశారు. తాము క్షేమంగా ఉన్నామని.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రతి హాస్టల్స్ లో నలుగురు ప్రొఫెసర్లను ఏర్పాటు చేసి.. విద్యార్థులకు రక్షణ కల్పించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ఇబ్బందికరంగా లేదనే మాట వినిపిస్తోంది. ఇక.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు నాలుగైదు వేలకు పైగా విద్యార్థులు మెడిసిన్ చేస్తున్నట్లు సమాచారం.