Begin typing your search above and press return to search.

లెబనాన్ పేజర్ పేలుళ్లలో కేరళ టెక్కీ.. బల్గేరియాలో అరెస్టు!

ఓ కేరళ టెక్కీ ప్రమేయం ఉందంటూ అతడిని అరెస్టు చేశారు. అదికూడా బల్గేరియాలో కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   21 Sep 2024 10:15 AM GMT
లెబనాన్ పేజర్ పేలుళ్లలో కేరళ టెక్కీ.. బల్గేరియాలో అరెస్టు!
X

పేజర్లు ఏమిటి..? జేబుల్లో పేలడం ఏమిటి..? ఊహకే అందని దాడి ఇది. శత్రువుకు దొరకకుండా తప్పించుకుందాం అంటే మరణమే మన ముంగిట్లోకి వచ్చినట్లు.. లెబనాన్ లో మంగళవారం పేజర్ పేలుళ్లు జరిగాయి. హెజ్జొల్లా ఉగ్రవాదులు, దాని సానుభూతి పరులే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. ఇప్పుడు ఆ లెబనాన్ పేలుళ్లలో మరొక ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఓ కేరళ టెక్కీ ప్రమేయం ఉందంటూ అతడిని అరెస్టు చేశారు. అదికూడా బల్గేరియాలో కావడం గమనార్హం.

2019లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీతో, ఇటీవల కొండచరియలు విరిగిపడి వందలమంది మరణంతో వెలుగులోకి వచ్చింది వయనాడ్.

ఈ ప్రాంతానికి చెందిన రిన్‌సన్‌ జోస్‌ (37) అనే యువకుడు నార్వేలో స్థిరపడ్డాడు. రెండేళ్ల కిందట బల్గేరియాలో నోర్టా గ్లోబల్‌ లిమిటెడ్‌ పేరటి కన్సల్టెన్సీ కంపెనీని ఏర్పాటు చేశాడు. హెజ్‌బొల్లా సభ్యులకు ఈ కంపెనీ నుంచే పేజర్లు వెళ్లాయని తొలుత అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అతడి కదలికలు కూడా మరింత బలం చేకూర్చాయి. బల్గేరియా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. పేజర్లలో పేలుడు పదార్థాలను ఈయన కంపెనీలోనే అమర్చి ఉంటారన్న అనుమానంతో మూడు రోజుల పాటు విచారించారు.

ఎందుకు చిక్కుకున్నాడో?

మన దేశానికి చెందినవారు గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి దొరక్క అల్లాడుతున్న వార్తలను చూశాం. అమెరికా వంటి దేశాలకు వెళ్లి ఉద్యోగాలు కోల్పోయి తిరిగి రావడం చూశాం. ఇటీవల ఉద్యోగాలని చెప్పి వేరే దేశాలకు తీసుకెళ్లి సైబర్ నేరాలకు పురిగొల్పడంపైనా కథనాలు వచ్చాయి. అయితే, రిన్సన్ జోస్ ది అలాంటి కథ కాదు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన అతడు కొంతకాలం లండన్‌లో పని చేశాడు. సొంత కంపెనీ ఏర్పాటు చేశాడు. ఇతడి భార్య కూడా నార్వే రాజధాని ఓస్లోలోనే ఉంది. అయితే లెబనాన్ పేలుళ్లతో బల్గేరియా దర్యాప్తు సంస్థ డీఏఎన్‌ఎస్‌.. జోస్‌ ను అదుపులోకి తీసుకుంది. విచారణలో పేలుళ్లకు సంబంధించిన పేజర్లు, ఇతడి కంపెనీకి సంబంధం లేదని గుర్తించారు. అంతేకాదు.. లెబనాన్‌ పేలుళ్లలోని పేజర్లు అసలు బల్గేరియా నుంచే వెళ్లలేదని ప్రకటించారు. దీందో జోస్ ను విడుదల చేశారు. అయితే, ఈ పరిణామాలతో కేరళలోని అతడి కుటుంబం ఆందోళనకు గురైంది. కనీసం ఫోన్‌ లో మాట్లాడేందుకు కూడా అనుమతించలేదని నార్వేలోని అతడి భార్య మీడియాతో వాపోయింది. అయితే, లెబనాన్‌ పేలుళ్ల కేసు నుంచి క్లీన్‌ చిట్‌ వచ్చినా జోస్ ను ఇంకా అధికారులు విడుదల చేయలేదని సమాచారం.

హంగరీ తయారీ..

లెబనాన్ లో పేలిన పేజర్లను తొలుత తైవాన్ లో తయారు చేశారనే కథనాలు వచ్చాయి. తర్వాత అవి హంగరీలో తయారైనట్లు తేలింది. ఇజ్రాయెల్ స్వయంగా హంగేరీలో కంపెనీని స్థాపించి హెజ్బొల్లాకు సరఫరా చేసిందని తేలింది. అంటే శత్రువుకు ముందే మరణ శాసనం రాసిందన్నమాట. అయినప్పటికీ నార్వే, బల్గేరియా వైపే దర్యాప్తు అధికారుల దృష్టి మళ్లింది. మరోవైపు పేజర్ల పేలుళ్లకు జోస్ కు చెందిన నోర్టా గ్లోబల్‌ లిమిటెడ్‌ తో ఎలాంటి సంబంధం లేదని డీఏఎన్‌ ఎస్‌ ప్రకటించింది. ఓస్లో పోలీసులూ ఇదే చెప్పారు. ఈ నెల 17న లెబనాన్‌ లో జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది చనిపోయారు. వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ దీని వెనుక ఉందనేది లెబనాన్‌ అనుమానం. అయితే, దీనిని మర్చిపోకముందే మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు చోటుచేసుకున్నాయి.