అమెరికాలో ఘోష్ హత్య..దొరకని నిందితులు
By: Tupaki Desk | 4 March 2024 4:42 AM GMTడాలర్ డ్రీమ్స్ తో అమెరికాలో ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది అడుగుపెడుతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ తమ కలల సాకారం కోసం కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే ప్రవాస భారతీయులతోపాటు, అమెరికాయేతరులు జాతి వివక్షకు గురవుతున్న ఘటనలు కూడా అనేకం. అయితే, 2014 ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత లోకల్ సెంటిమెంట్ బాగా పెరిగిపోయింది. దీంతో, మునుపెన్నడూ లేని విధంగా భారతీయులపై జాత్యాహంకార దాడులు పెరిగిపోయాయి.
ఇటీవల కాలంలో ప్రత్యేకించి భారతీయుల మీద అమెరికాలో దాడులు ఎక్కువయ్యాయి. కందుల జాహ్నవి యాక్సిడెంట్ ఉదంతంలో సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోలేదు. ఆ ఘటన మరువక ముందే క్లాసికల్ డాన్సర్ అమర్నాథ్ ఘోష్ పై నాలుగు రోజుల క్రితం దుండగులు కాల్పులు జరిపారు. కానీ, ఇంతవరకు నిందితులెవరన్నది పోలీసులు గుర్తించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు తన మేనల్లుడు ఘోష్ ను హత్య చేసిన వారిని పట్టుకోలేకపోయారని ఆయన మేనమామ సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదని అన్నారు. ఈ రోజు వరకు నిందితుల ఆచూకీ దొరకకపోవడం విచారకరమన్నారు. పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటారని ఆశిస్తున్నామన్నారు.
ఘోష్ తరఫున పోరాడేందుకు ఆయన మేనమామ తప్ప వేరే ఎవరూ లేరని ఆయన స్నేహితురాలు భట్టాచార్య చెప్పారు. ఆయన తల్లి మూడు సంవత్సరాల క్రితం మరణించగా, ఆయన తండ్రి చిన్నతనంలోనే చనిపోయారని అన్నారు. ఘోష్ కోసం పోరాడేందుకు ఆయన కుటుంబంలో కొంతమంది, స్నేహితులు కొంతమంది మాత్రమే ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, బెంగాల్ అధికారులు కూడా ఘోష్ హత్యకు సంబంధించిన వివరాలు అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆమె ఆరోపించారు.