Begin typing your search above and press return to search.

పాస్ పోర్ట్ కోర్టులో ఉంటే... ఎన్నారై అమెరికాకు ఎలా వెళ్లాడు?

ప్రాథమికంగా కోర్టు దిక్కారానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టులో దోషిగా నిర్ధారించబడి, పాస్ పోర్ట్ ను కోర్టులో డిపాజిట్ చేసిన ఓ ఎన్నారై.. తాజాగా దేశం విడిచి అమెరికాకు వెళ్లిపోయారట.

By:  Tupaki Desk   |   1 Feb 2025 6:01 AM GMT
పాస్ పోర్ట్ కోర్టులో ఉంటే... ఎన్నారై అమెరికాకు ఎలా వెళ్లాడు?
X

భారతదేశంలో ప్రతీ ఇంటికీ ఓ దొడ్డి దారి ఉంటుంది అనేది ఓ సినిమాలోని డైలాగ్! ఈ ప్రపంచంలో ప్రతీ దానికీ ఓ రేటు ఉంటుంది.. ఇది మరో సినిమాలోని డైలాగ్! కొన్ని ఘటనలు తెరపైకి వచ్చినప్పుడు పైన చెప్పుకున్న రెండు డైలాగులకూ బలం చేకూరుతుంటుందని అంటారు. ఈ క్రమంలో పాస్ పోర్ట్ కోర్టు చేతిలో ఉంటే.. ఎన్నారై అమెరికాకు వెళ్లిన ఘటన తెరపైకి వచ్చింది!

అవును... ప్రాథమికంగా కోర్టు దిక్కారానికి పాల్పడినందుకు సుప్రీంకోర్టులో దోషిగా నిర్ధారించబడి, పాస్ పోర్ట్ ను కోర్టులో డిపాజిట్ చేసిన ఓ ఎన్నారై.. తాజాగా దేశం విడిచి అమెరికాకు వెళ్లిపోయారట. దీంతో... ఈ వ్యవహారంపై కోర్టు సీరియస్ అయ్యింది. అతడు వెళ్లడానికి ఎవరు సహాయం చేశారో కనుగొనడానికి అతన్ని అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

విడాకులు తీసుకున్న తర్వాత అన్ని వివాదాలకూ ముగింపు పలికేలా వారి మధ్య కుదిరిన సెటిల్ మెంట్ లో భాగంగా... తన 10 ఏళ్ల కుమారుడి సంరక్షణను, అతని మాజీ భార్యకు అప్పగించాలని కోర్టు ఎన్నారై మనీష్ చోకర్ ను ఆదేశించింది. అయితే అతను ఆ ఆదేశాలను పాటించలేదు. దీంతో.. అతడిపై కోర్టు దిక్కార అభియోగాలు మోపబడ్డాయి.

దీనికి సంబంధించిన విచారణ జనవరి 22న జరగగా.. కోర్టుకు హాజరుకాలేదు మనీష్ చోకర్. ఈ సమయంలో అతని తరుపున సీనియర్ లాయర్ వికాస్ సింగ్ స్పందిస్తూ.. తదువరి విచారణ తేదీన అతడు హాజరవుతాడని బెంచ్ కి హామీ ఇచ్చారు. అయితే.. ఆ మరుసటి విచారణ తేదీ జనవరి 29న కూడా అతడు కోర్టులో హాజరు కాలేదు.

దీనిపై స్పందించిన అతని తరుపు న్యాయవాది.. అతడు తన రెండో భార్యతో కలిసి ఉంటున్న కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమెరికాకు వెళ్లిపోయారని కోర్టుకు తెలిపారు. దీంతో.. కోర్టు అధికార పరిధి నుంచి తప్పించుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ధర్మాసనం.

ఈ సందర్భంగా స్పందిస్తూ... అతని పాస్ పోర్ట్ కోర్టు కస్టడీలో ఉన్నప్పటికీ.. అతడు అమెరికా.. లేదా, ఏదైనా దేశానికి పాస్ పోర్ట్ లేకుండా ఎలా వెళ్లగలరని ప్రశ్నించింది. ఈ విషయం తెలిసి తాము ఆశ్చర్యపోతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది!

ఇదే సమయంలో... మనీష్ ను అరెస్ట్ చేయడానికి చట్టప్రకారం సాధ్యమయ్యే ప్రతీ చర్యను తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశిస్తామని తెలిపింది. దీంతో... ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.