Begin typing your search above and press return to search.

NRI మహిళ అనుమానాస్పద మరణం: హోటల్ గదిలో మిస్టరీ!?

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్ గదిలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మరణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

By:  Tupaki Desk   |   9 March 2025 2:00 PM IST
NRI మహిళ అనుమానాస్పద మరణం: హోటల్ గదిలో మిస్టరీ!?
X

విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హోటల్ గదిలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మరణించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆమె మరణానికి సంబంధించిన అనేక అనుమానాలు తలెత్తుతుండటం, భర్త, పిల్లలు అమెరికాలో ఉండటం మరింత మిస్టరీగా మారింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకోగా శనివారం వెలుగు చూడటం దీనిపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.

- ఈ మహిళ ఎవరు?

సీతమ్మధారకు చెందిన 48ఏళ్ల ఈ మహిళ అమెరికాలో స్థిరపడ్డారు. విశాఖకు చెందిన డాక్టర్ శ్రీధర్ (52) కూడా అమెరికాలోనే స్థిరపడ్డారు. వీరి మధ్య స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహిళ విశాఖకు రావటానికి కారణం ద్వారకానగర్‌లోని ఒక ప్రైవేటు స్థలాన్ని లీజ్ ఒప్పందం చేసుకోవడమే. శ్రీధర్ కూడా నెల క్రితమే విశాఖకు వచ్చి, హోటల్ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆమె కూడా అదే హోటల్ గదిలో ఉంటుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

- శ్రీధర్ ఫిర్యాదు ఏమిటి?

గురువారం మధ్యాహ్నం బాత్రూంలోని షవర్‌కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు త్రీ టౌన్ సీఐ తెలిపారు. అయితే బాత్రూంలో ఉరి వేసుకున్న దాఖలాలు లేవని, ఆమె అనారోగ్యంతో మరణించినట్లు మరో స్టేట్ మెంట్ ఇచ్చారు. దీనిపై విచారణ జరిపే క్రమంలో డాక్టర్ శ్రీధర్ ఫోన్‌లో ఉన్న కొన్ని వీడియోలు బయటకు రావడం, వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం అందడం మరింత అనుమానాస్పదంగా మారింది.

- ఆత్మహత్యా? హత్యా?

ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యకు గురయ్యారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోస్టుమార్టం టైంకి శరీరం ఉబ్బిపోయి ఉండటంతో పాటు, దుర్వాసన వస్తోందని మార్చురీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళ భర్త అమెరికా నుంచి విశాఖ రానున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరణానికి గల అసలు కారణం తెలియనుంది. ఈ సంఘటన విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు ప్రస్తుతం ఈ కేసును లోతుగా విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేదాకా ఏ విషయంపైనూ తుది నిర్ణయానికి రావడానికి వీలు లేదని పోలీసులు తెలిపారు. మహిళ మృతితోపాటు, ఆమెకు, శ్రీధర్ మధ్య ఉన్న సంబంధం, గొడవల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

దీనిపై పోలీసులు ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.