ఆస్ట్రేలియాలో తెలుగు మహిళా డాక్టర్ విషాదాంతం!
ఈ క్రమంలో మార్చి 2న ఉజ్వల తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది, ఈ క్రమంలో కాలు జారి లోయలో పడిపోయింది.
By: Tupaki Desk | 9 March 2024 4:28 AM GMTఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ యువతి వేమూరు ఉజ్వల (23) మృతి చెందడం విషాదాన్ని నింపింది. తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించింది.
ఈ ఘటన పూర్తివివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా ఉంగుటూరుకు చెందిన వేమూరు ఉజ్వలకు వైద్య రంగమంటే ఆసక్తి. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఆశపడుతుండేది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ పూర్తికాగానే ఆస్ట్రేలియాలో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్లింది. అక్కడ గోల్డ్ కోస్ట్ లోని బాండ్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. మంచి ఉద్యోగం కూడా సాధించింది.
ప్రస్తుతం ఉజ్వల రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ హాస్పిటల్‌లో ఉద్యోగం చేస్తోంది. అలాగే పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం పీజీ ప్రయత్నాల్లో ఉంది.
ఈ క్రమంలో మార్చి 2న ఉజ్వల తన స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లింది, ఈ క్రమంలో కాలు జారి లోయలో పడిపోయింది. అప్రమత్తమైన స్నేహితులు ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె మృతి చెందింది.
ఆమె దుర్మరణంతో ఉజ్వల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. మార్చి 9న అంత్యక్రియల నిమిత్తం ఆమె మృతదేహాన్ని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకలపాడులోని ఉజ్వల అమ్మమ్మ, తాతయ్య ఇంటికి తీసుకొస్తున్నారు.
ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియాకు వెళ్లిన ఉజ్వల తనకు ఇష్టమైన రంగంలో స్థిరపడుతుండగానే విధి కాటేసింది. విధి ఆడిన వింత నాటకంలో ఆమె తన లక్ష్యాన్ని చేరుకోకుండానే తనతో తీసుకుపోయింది. రెండు పదుల వయసులోనే తీరని లోకాలకు తరలిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తల్లడిల్లుతున్నారు.