అత్యధికంగా సంపాదిస్తున్న రెండో సీఈవో మనోడే!
ప్రపంచంలో నలుమూలలా భారతీయులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు
By: Tupaki Desk | 22 May 2024 7:54 AM GMTప్రపంచంలో నలుమూలలా భారతీయులు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ తదితర సంస్థల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో అత్యధిక మొత్తాన్ని ఆర్జిస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న రెండో భారతీయ సీఈవోగా నికేశ్ అరోరా రికార్డు సృష్టించారు. పాలో ఆల్టో నెట్వర్క్ సీఈవోగా ఆయన ఉన్నారు. ఈ క్రమంలో అమెరికాలో అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న రెండో సీఈవోగా ఘనత సాధించారు.
తాజాగా 2023 సంవత్సరానికి అత్యధిక మొత్తాలు అందుకున్న సీఈవోల జాబితాను ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించింది. ఈ జాబితాలో మొత్తం 17 మంది భారతీయ సంతతి సీఈవోలు చోటు దక్కించుకోవడం విశేషం.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ జాబితా ప్రకారం మొత్తం 17 మంది భారతీయ సంతతి సీఈవోలు టాప్ 500 ర్యాంకింగ్స్ లో ఉన్నారు. అడోబ్ సీఈవోగా ఉన్న శంతను నారాయణ్ తో కలిసి నికేశ్ అరోరా సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
నికేశ్ అరోరా, శంతను నారాయణ్ మొత్తం మీద అత్యధిక మొత్తం అందుకుంటున్నవారి జాబితాలో 11 వ స్థానంలో ఉన్నారు. 2023లో ఎలాంటి జీతం తీసుకోని ఎలాన్ మస్క్ కంటే నికేశ్ అరోరా, శంతను నారాయణ్ ఎక్కువ మొత్తం సంపాదించడం విశేషం,
నికేశ్ అరోరా 151.43 మిలియన్లు డాలర్లు సంపాదించారు. ఇక మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ 24.40 మిలియన్ డాలర్లు, గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్పాబెట్ అధినేత సుందర్ పిచాయ్ 8.80 మిలియన్ డాలర్లు ఆర్జించారు.
కాగా ఢిల్లీకి చెందిన నికేశ్ అరోరా మొదట గూగుల్ లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేసి అద్భుత పనితీరుతో ఆకట్టుకున్నారు. 2014లో సాఫ్ట్ బ్యాంక్ కు నాయకత్వం వహించారు.
ఇక 2018 నుండి సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్వర్క్ కు నికేశ్ అరోరా నాయకత్వం వహిస్తున్నారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ లో ఆయనకు భారీగా ఈక్విటీ షేర్లు ఉన్నాయి.
ఇక హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శంతను నారాయణ్ 1998లో అడోబ్ లో చేరిన తర్వాత 2007 నుంచి సీఈవోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇక అందరికంటే 2023లో అత్యధిక జీతం తీసుకున్న రికార్డు బ్రాడ్ కామ్ కు చెందిన హాక్ టాన్ కు దక్కింది. ఆయన 162 మిలియన్ డాలర్ల సంపాదనతో అగ్రస్థానంలో ఉన్నాడు.
భారతీయ అమెరికన్లలో మైక్రోన్ టెక్నాలజీకి చెందిన సంజయ్ మల్హోత్రా (63వ స్థానం, 25.28 మిలియన్ డాలర్లు), అజీ గోపాల్ (66వ స్థానం, 24.63 మిలియన్ డాలర్లు), వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ కు చెందిన రేష్మా కేవల్రమణి (118వ స్థానం, 20.59 మిలియన్ డాలర్లు) భారతీయ అమెరికన్లలో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.