Begin typing your search above and press return to search.

అడ్డేదీ.. అమెరికాలో భారతీయుడిపై మరో ఘోరం!

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులపై వరుస దాడులకు అడ్డుకట్ట పడటం లేదు

By:  Tupaki Desk   |   18 March 2024 5:44 AM GMT
అడ్డేదీ.. అమెరికాలో భారతీయుడిపై మరో ఘోరం!
X

అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయులపై వరుస దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. జాతి వివక్షో, మరో కారణమో కానీ భారతీయులే లక్ష్యంగా పేట్రేగిపోతున్నారు. అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న భారతీయుల మరణాలు, భారతీయులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రమాదాల్లో మరణిస్తున్నవారితోపాటు ఇటీవల కాలంలో హత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో భారతీయ కుటుంబం హత్యకు గురయింది. ఇటీవల ఒక భారతీయ సంగీతకారుడిని కాల్చిచంపారు. అలాగే ఒక విద్యార్థిని ఆశ్రయం ఇవ్వనందుకు ఒక దేశదిమ్మరి దారుణంగా కొట్టి హత్య చేశాడు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌ నాథ్‌ ఘోష్‌ ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మూడు రోజుల క్రితం పిట్టల వెంకట రమణ అనే విద్యార్థి ఒక ప్రమాదంలో కన్నుమూయడం అందరిలో విషాదాన్ని నింపింది.

ఇలా అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల వరుస మరణాలను మరిచిపోకముందే రెండు రోజుల క్రితం మరో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్‌ ను అతడు చదువుతున్న బోస్టన్‌ యూనివర్సిటీలోనే కాల్పి చంపారు.

ఇప్పుడు తాజాగా ఇంకో దారుణం చోటు చేసుకుంది. అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్‌ లో మరో దురదృష్ట ఘటన జరిగింది. బాధితుడు పటేల్‌ బ్రదర్స్‌ స్టోర్‌ యజమాని కుమారుడని వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే బాధితుడు ఎవరనేది ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కారులో ఉన్న ఒక భారతీయ వ్యక్తి పైన ముగ్గురు దాడి చేసి.. అతడిని కారులో నుంచి లాగిపడేసిన వైనం సీసీ టీవీ పుటేజీ వీడియోల్లో వెలుగు చూసింది. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్‌ కావడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ఖరీదైన కారులో ఉన్న భారతీయ వ్యక్తిపై పలువురు వ్యక్తులు దాడికి ప్రయత్నించడం సీసీటీవీ ఫుటేజీలో ఉంది. ఆగి ఉన్న కారులో అతడు కూర్చుని ఉండగా.. రెండు వైపులా వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై దాడి చేయడంతోపాటు కారు నుంచి బలవంతంగా బయటకు లాగేశారు. ఈ ఘటనలో అతడు గాయపడలేదు. వెంటనే సమీపంలోని స్టోర్‌ లోకి పరిగెత్తి పోలీసులను పిలిచాడు.

అమెరికాలో వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్న సందేశం ప్రకారం.. ‘‘మార్చి 15న మధ్యాహ్నం.. న్యూజెర్సీలోని ఎడిసన్‌ లో పటేల్‌ బ్రదర్స్‌ పార్కింగ్‌ స్థలంలో మా కమ్యూనిటీ సభ్యుల్లో ఒకరి కారును దొంగతనం చేయడానికి కొందరు ప్రయత్నించారు. మాస్కులు పెట్టుకున్న ముగ్గురు ఆఫ్రికన్‌ అమెరికన్‌ వ్యక్తులు ఖరీదైన కారు (బెంట్లీ) నుండి కారు యజమాని (పటేల్‌ బ్రదర్స్‌ స్టోర్‌ యజమాని కుమారుడు)ని బయటకు లాగారు. దుండగులు అతడిని కొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ బాధితుడు కారును ఆఫ్‌ చేశాడు. వెంటనే స్టోర్‌ లోపలికి పరిగెత్తి పోలీసులను పిలిచాడు’’ అని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.