జాహ్నవి కందుల ఘటన... యూఎస్ పోలీస్ కు బిగ్ షాక్!!
ఏపీలో కర్నూలు జిల్లాకు చెందిన 23ఏళ్ల కందుల జాహ్నవి గత ఏడాది జనవరిలో సియాటెల్ లోని పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఢీకొని మృతిచెందిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 July 2024 5:45 AM GMTఏపీలో కర్నూలు జిల్లాకు చెందిన 23ఏళ్ల కందుల జాహ్నవి గత ఏడాది జనవరిలో సియాటెల్ లోని పోలీసు పెట్రోలింగ్ వెహికల్ ఢీకొని మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తుపై యూఎస్ పోలీస్ అధికారి డెనియల్ అడెరర్.. చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సమయలో ఆ అధికారికి బిగ్ షాక్ తగిలింది.
అవును... కందుల జహ్నవి గత ఏడాది అమెరికాలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీస్ ఆఫీసర్ డెనియల్ చులకనగా మాట్లాడుతూ, పగలబడి నవ్విన వీడియో ఆ మధ్య వైరల్ గా మారింది. ఇందులో... ఆమె ఓ సాధారణ వ్యక్తి అని, ఈ మరణానికి పెద్ద విలువ లేదు అన్నట్లుగా అతడు మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
అతడి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. నెట్టింట ఆ పోలీస్ అధికారి వెకిలి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో.. సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇలా ఒక్కసారిగా ఆ అధికారిపై ఈ స్థాయిలో విమర్శలు వచ్చేసరికి అతడిని అప్పట్లోనే సస్పెండ్ చేశాడు. ఈ క్రమంలో తాజాగా తుది చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా... జాహ్నవి కందుల మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్ అడెరర్ అనే పోలీస్ అధికారిని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఈ సందర్భంగా స్పందించిన సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ సూ రహర్... ఆయన మాటలు మనసును గాయపరిచేలా ఉన్నాయని.. వాటిని ఎవ్వరూ మాంపలేరని అన్నారు. ఆయన మాటలు సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ కే మాయని మచ్చను తెచ్చాయని తెలిపారు.
ఇదే సమయంలో... డేనియల్ వ్యవహారం పోలీస్ వృత్తికే సిగ్గుచేటని.. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే డేనియల్ ను ఇంకా విధుల్లో కొనసాగించడం సరైన ఆలోచన కాదని.. అలా చేయడం డిపార్ట్మెంట్ కే అగౌరవమని వ్యాఖ్యానించిన సూ రహార్... అందుకే ఆయన్ని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.