Begin typing your search above and press return to search.

శాశ్వత పౌరసత్వం వచ్చిన కొద్ది రోజులకే దారుణం!

అమెరికా, కెనడాల్లో భారతీయులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Jun 2024 2:30 PM GMT
శాశ్వత పౌరసత్వం వచ్చిన కొద్ది రోజులకే దారుణం!
X

అమెరికా, కెనడాల్లో భారతీయులపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు పలువురు భారతీయులు ఆ దేశస్తుల దాడుల్లో, కాల్పుల్లో మృతి చెందడం గమనార్హం. ఇది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. చదువుకోవడానికి, ఉద్యోగాల నిమిత్తం అమెరికా, కెనడాలకు వెళ్తున్న భారతీయులే లక్ష్యంగా హింసాత్మక ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి.

ముఖ్యంగా కెనడాలో ఇటీవల భారత వ్యతిరేక చర్యలు ముమ్మరం కావడం ఆందోళన రేపుతోంది. ఖలిస్తాన్‌ ఉగ్రవాది హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వ్యవహారం తర్వాత భారత్‌ – కెనడా సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కెనడాలో ఉంటున్న భారతీయులే లక్ష్యంగా ఖలిస్తాన్‌ ఏర్పాటు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయి. తాజాగా కెనడాలో ఉంటున్న యువరాజ్‌ గోయల్‌ (28) ను హత్య చేశారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. జూన్‌ 7న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెల్లడైంది.

కాగా దుండగుల చేతిలో హత్యకు గురయిన యువరాజ్‌ పంజాబ్‌ లోని లుథియానాకు చెందినవారు. ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం 2019లో ఆయన కెనడాకు వచ్చారు. చదువు పూర్తి కావడంతో కెనడాలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ గా ఉద్యోగం చేస్తున్నారు.

ఈ క్రమంలో కెనడాలో యువరాజ్‌ కు ఇటీవల శాశ్వత నివాస హోదా కూడా దక్కింది. ఇంతలోనే ఈ సంతోషం ఆవిరైంది. కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో యువరాజ్‌ పై దుండగలు కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న కెనడా పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించేసరికే యువరాజ్‌ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. అసలు కాల్పులు జరపడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.

మృతుడు యువరాజ్‌ కు ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని తెలుస్తోంది. ఆయన మంచి వ్యక్తి అని, తన పని ఏదో తాను చూసుకుంటారని.. ఎవరి విషయాల్లోనూ ఆయన తలదూర్చరని స్థానికులు చెబుతున్నారు.