Begin typing your search above and press return to search.

ఘోరం.. తమ్ముడిని కాల్చి చంపి.. ఆ పై తల్లిని..!

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం రిచ్‌ మండ్‌ హిల్‌ పరిసరాల్లో దారుణం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 7:50 AM GMT
ఘోరం.. తమ్ముడిని కాల్చి చంపి.. ఆ పై తల్లిని..!
X

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం రిచ్‌ మండ్‌ హిల్‌ పరిసరాల్లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి తన తమ్ముడిని కాల్చిచంపాడు. ఈ ఘటనలో తల్లిని కూడా కాల్చగా ఆమె గాయాలతో బయటపడింది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరం రిచ్‌ మండ్‌ హిల్‌ ను ఉలిక్కిపడేలా చేసింది.

ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కరమ్‌ జిత్‌ ముల్తానీ (33), తన తమ్ముడు విపన్‌ పాల్‌ (27)ని ఆదివారం రిచ్‌ మండ్‌ హిల్‌ పరిసరాల్లోని వారి ఇంటిలో కాల్చి చంపాడు. ఈ క్రమంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన తల్లిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె కడుపులోకి తూటాలు దూసుకెళ్లాయి. ఆ తర్వాత ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన నిందితుడు కరమ్‌ జిత్‌ తలపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాల్పుల్లో గాయపడ్డ నిందితుడి తల్లిని ఆస్పత్రిలో చేర్చారు. అతడి తమ్ముడు విపన్‌ పాల్‌ కాల్పుల్లో అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. అలాగే నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెల్లడించారు. ప్రస్తుతానికి నిందితుడి తల్లికి ప్రాణాపాయం లేదని తెలిపారు.

కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపీందర్‌ ముల్తానీకి ముగ్గురు కుమారులు, భార్య ఉన్నారు. వీరు రిచ్‌ మండ్‌ హిల్‌ దక్షిణ భాగంలో పంజాబీ సిక్కులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతంలో ఉంటున్నారు. భూపీందర్‌ ముల్తానీ పెద్ద కుమారుడే కాల్పులు జరిపిన కరమ్‌ జిత్‌ ముల్తానీ. ఈ ఘటన జరిగినప్పుడు భూపీందర్‌ ముల్తానీ ఇంటిలోనే ఉన్నారు. తన పెద్ద కుమారుడు, తన చిన్న కుమారుడిని ఎందుకు కాల్చిచంపాడో తనకు తెలియదని ఆయన పోలీసులకు తెలిపారు.

తన కుమారుల మధ్య చిన్న చిన్న విభేదాలు తప్ప పెద్ద సమస్యలేమీ లేవని భూపీందర్‌ ముల్తానీ పోలీసులకు వివరించారు. తమకు ఆర్థిక సమస్యలు కూడా లేవన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను భయపడి సహాయం కోసం పొరుగింటికి పరిగెత్తానని తెలిపారు. పొరుగింటివారు వచ్చేసరికి తన అన్న చేతిలో విపన్‌ పాల్‌ తీవ్ర గాయాలతో కనిపించాడు. ఈ క్రమంలో అతడిని ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో కాల్పుల ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

కాగా రిచ్‌ మండ్‌ హిల్‌ లో ఎక్కువ మంది ఆసియన్లు నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది భారతదేశం లేదా కరేబియన్‌ దేశాల నుండి వచ్చిన భారతీయ సంతతికి చెందినవారే. ఈ ప్రాంతం మొత్తం జనాభాలో 26 శాతం మందే భారత సంతతి ప్రజలే కావడం గమనార్హం.