అమెరికాలో మరో దారుణం.. ఈసారీ తెలుగు విద్యార్థే!
ఈ విషాదాలు చాలవన్నట్టు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థి ఆచంట రేవంత్ నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
By: Tupaki Desk | 6 April 2024 7:41 AM GMTఅమెరికాలో భారతీయుల వరుస మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. రోజుల వ్యవధిలోనే వరుసగా వివిధ ప్రమాదాల్లో లేదా హత్యలకు గురై భారతీయులు మృతి చెందుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది భారతీయులకు అసలు అచ్చిరాలేదు. ఈ ఏడాది మూడు నెలల 5 రోజుల్లోనే అమెరికాలో వరుసగా భారతీయులు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది.
ఫ్లోరిడాలోని ఇండియానా యూనివర్సిటీ పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్న పిట్టల వెంకటరమణ అనే తెలుగు విద్యార్థి కొద్ది రోజుల క్రితమే ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే వారం క్రితం రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన తల్లీకూతురు గీతాంజలి, హానిక మృత్యువాత పడ్డారు.
ఈ విషాదాలు చాలవన్నట్టు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా విద్యార్థి ఆచంట రేవంత్ నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలనుకున్న అతడి కలలను విధి కర్కశంగా చిదిమేసింది.
ఇప్పుడు తాజాగా మరో తెలుగు విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మృత్యువాత పడ్డాడు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ వెల్లడించింది.
మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కాన్సులేట్ తెలిపింది. అతడు ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లో చదువుతున్నాడు.
ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘ఓహియోలోని క్లీవ్ ల్యాండ్ లో ఉన్న భారతీయ విద్యార్థి శ్రీ ఉమా సత్య సాయి గద్దె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని పేర్కొంది.
ఉమా సత్యసాయి మరణానికి కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోందని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది. తాము భారత్ లోని అతడి కుటుంబంతో టచ్ లో ఉన్నట్టు వెల్లడించింది. అతడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్ కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు అతడి కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల సహాయాలను అందిస్తున్నామని తెలిపింది.