యూఎస్ సెక్యూర్టీలో దొంగలు... ప్రయాణికుల బ్యాగులో నుంచి డబ్బు చోరీ!
అగ్రరాజ్యం అమెరికాలోని ఒక విమానాశ్రయంలో దొంగలు పడ్డారు.
By: Tupaki Desk | 16 Sep 2023 9:47 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలోని ఒక విమానాశ్రయంలో దొంగలు పడ్డారు. దొంగలు అంటే బయటనుంచి వచ్చి బెదిరించి డబ్బులు, విలువైన వస్తువులూ ఎత్తుకుపోయేవారు కాదు సుమా... సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తూ ప్రయాణికుల బ్యాగ్గుల్లోంచి డబ్బులు దొంగిలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
అవును... యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ అధికారులు ప్రయాణికుల బ్యాగ్ ల నుంచి డబ్బు దొంగిలిస్తూ కెమెరాలో చిక్కుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపింది. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కార్మికులు ప్రయాణీకుల బ్యాగ్ లలోని డబ్బు, ఇతర వస్తువులను దొంగిలింంచే పనికి పూనుకున్నారు.
ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 29న విమానాశ్రయ సెక్యూరిటీ అధికారులు, ప్రయాణీకుల బ్యాగ్స్ నుంచి 600 డాలర్ల నగదు, ఇతర వస్తువులను దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో... చోరీ చేసిన వారిని జోస్యు గొంజాలెజ్ (20), లాబారియస్ విలియమ్స్ (33)గా గుర్తించారు అధికారులు.
ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలో.. ప్రయాణికులు ఎక్స్ రే మెషిన్ కు వెళ్లే మార్గంలో పర్సులు, బ్యాగుల నుంచి డబ్బు తీసుకున్నట్లు ఉంది. ఒక సెక్యూరిటీ అధికారి తన చేతిని బ్యాగులో పెట్టి డబ్బు కాజేసి, దాన్ని తన జేబులో పెట్టుకోవడం స్పష్టంగా కనిపించింది. దీంతో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందినీ కాస్త గట్టిగా విచారిస్తే... రోజుకు సగటున 1000 డాలర్లు దొంగిలించినట్లు అంగీకరించారట.
దీంతో విచారణ అనంతరం ఈ ఇద్దరినీ విధుల నుంచి తొలగించారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... ఆ విమానాశ్రయంలో తమ వస్తువులు కూడా పోయాయంటూ పలువురు ఆన్ లైన్ వేదికగా కామెంట్లు పెడుతున్నారు.