Begin typing your search above and press return to search.

యూఎస్ నుంచివెనక్కొచ్చిన విద్యార్థులు... అసలు కారణం ఇదేనా?

అగ్రరాజ్యానికి వీసా, కోరుకున్న విద్యాసంస్థలో సీటు వచ్చిందన్న ఆనందంతో ఎగిరి గంతేస్తూ అమెరికా ప్రయాణమై వెళ్లిన భారతీయ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Aug 2023 5:43 AM GMT
యూఎస్ నుంచివెనక్కొచ్చిన విద్యార్థులు... అసలు కారణం ఇదేనా?
X

అగ్రరాజ్యానికి వీసా, కోరుకున్న విద్యాసంస్థలో సీటు వచ్చిందన్న ఆనందంతో ఎగిరి గంతేస్తూ అమెరికా ప్రయాణమై వెళ్లిన భారతీయ విద్యార్థులకు అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒకేసారి సుమారు 21 మందిని వెనక్కి పంపారు! ఈ సమయంలో ఇందుకు గల కారణాలపై చర్చ జరుగుతుంది.

అవును... అమెరికా విమానాశ్రయం నుంచే రిటన్ ఫ్లైట్ లో వెనక్కి పంపబడిన భారతీయ విద్యార్థులు ఆర్థిక మోసానికి పాల్పడ్డారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆర్థిక విషయాలకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలున్న వారిని నిరోధించేందుకు అమెరికా అధికారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకుని బలమైన సంకేతాలు పంపారని అంటున్నారు.

విద్యార్థుల్లో చాలా మంది వీసాలు పొందేందుకు తప్పుడు ఫిక్స్‌ డ్ డిపాజిట్లను సమర్పిస్తుంటారని.. రుసుము కోసం ఈ ప్రక్రియను సులభతరం చేసే కొన్ని బ్యాంకులు - విద్యార్థుల మధ్య మధ్యవర్తులు ఉన్నారని అంటుంటారు. అయితే యూఎస్ నుంచి వెనక్కి పంపబడిన విద్యార్థుల్లో కూడా ఈ పనులకు పాల్పడినవారు ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే తాజాగా ఈ విషయాలపై అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు స్పందించారని తెలుస్తోంది. ఇందులో భాగంగా... "మేం సమర్పించే అన్ని ధ్రువపత్రాలు నిజమైనవేనని వీసా మంజూరు సమయంలో విద్యార్థులు ధ్రువీకరిస్తారు. కానీ... వాటిలో తప్పుడు పత్రాలుంటే వారిని వెనక్కి పంపిస్తారు" అని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు చెబుతున్నారు.

ఇదే సమయంలో వాట్సప్‌ లో చేసిన ఛాటింగ్‌ లు, ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ లాంటి సోషల్ మీడియాల్లో పోస్టులు, ఈ-మెయిళ్ల వంటివి.. ఇప్పుడు వందల మంది విద్యార్థులకు అమెరికాలో అడుగుపెట్టేందుకు అవరోధంగా మారుతున్నాయని అంటునారు.

ఈ క్రమంలో తమకు అనుమానం వచ్చినవారిని లేదా కొందరినైనా ప్రశ్నించేందుకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ఛాటింగ్‌ లను ఇమిగ్రేషన్‌ అధికారులు పరిశీలిస్తారని తెలుస్తుంది.

కాగా... గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఈ ఏడాది అమెరికా విద్యకు పయనమవుతున్నారు. గత ఏడాది 1.90 లక్షల మంది వెళ్లగా.. ఈసారి జనవరి నుంచి జూన్‌ వరకే 91 వేల మంది యూఎస్‌ లో అడుగుపెట్టారు.

ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబరులో మొదలయ్యే ఫాల్‌ సీజన్‌ కోసం జులై నుంచే వెళ్లడం మొదళుపెట్టారు. ఈ సంవత్సరం ఏకంగా 2.50 లక్షల నుంచి 2.70 లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్తారని అంచనా!