అమెరికా ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన సుహాస్ సుబ్రహ్మణ్యం!
ఈ సమయంలో యూఎస్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు విజయం ఢంకా మోగిస్తున్నారు.
By: Tupaki Desk | 6 Nov 2024 5:45 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన 230 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. కమలా హారిస్ 210 ఓట్లు సాధించారు. విజయానికి 270 ఓట్లు అవసరమనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో యూఎస్ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు విజయం ఢంకా మోగిస్తున్నారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయం సాధించారు. వర్జీనియా 10వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుపున గెలుపొందారు. ఈయన గతంలో ఒబామా హయాంలో టెక్ పాలసీ అడ్వైజర్ గా పనిచేశారు.
దీంతో వర్జీనియా, మొత్తం ఈస్ట్ కోస్ట్ నుంచి ఎన్నికైన మొదటి భారతీయ అమెరికన్ గా సుహాస్ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు.
ఇదే క్రమంలో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూరి.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయం సాధించారు. ఇల్లినోయీ 8వ కాంగ్రేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఇందులో భాగంగా రిపబ్లిక అభ్యర్థి మార్క్ రిక్ ను సుమారు 30 వేలకు పైగా ఓట్లతో ఓడించారు.
మరోవైపు ఇల్ల్లినోయిలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. మొదటి నుంచి కమలా హారిస్ కు అండగా నిలిచిన ఈ రాష్ట్రంలో ఆమె విజయం సాధించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 14 ఎలక్టోరల్ ఓట్లు కమలకు లభించనున్నాయి!
ఇక అమెరికా ఎన్నికల ఫలితాల్లో స్వింగ్ స్టేట్స్ లో పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ఆరు రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు గణాంకాలు చెబుతుండగా.. మరికొన్ని చోట్ల నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ ఫలితం దోబూచులాడుతోంది. ఇప్పటికే ట్రంప్ 230 స్థానాల్లో విజయం ఖాయం చేసుకున్నారు.