అమెరికాలో కోలుకుంటున్న భారతీయ విద్యార్థిని..!
అమెరికా వెళ్లి పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు
By: Tupaki Desk | 28 July 2023 10:46 AM GMTఅమెరికా వెళ్లి పిడుగుపాటుకు గురైన భారతీయ విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (25) కోమా నుంచి బయటికి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ ను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్న వైద్యులు... నిరంతరం ఆమె పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
అవును... వెంటిలేటర్ అవసరం లేకుండా ఆమె శ్వాస తీసుకుంటోదని.. నిజంగా అద్భుతం జరిగిందనే చెప్పాలని.. వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగవడంతో వెంటలేటర్ సదుపాయాన్ని తొలగించినట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రత్యేక వైద్యుల బృందం నిరంతరం సుశ్రూణ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు.
ఇక, సుశ్రూణ్య కుటుంబ సభ్యులకు వీసా లభించిందని.. వచ్చే వారం వారు హైదరాబాద్ నుంచి అమెరికాకు చేరుకుంటారని ఆమె బంధువు సురేంద్ర కుమార్ తెలిపారు. మరోపక్క ఆమెకు సుదీర్ఘకాలం వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలు తెలపడంతో ఆర్థిక సహాయం కోసం ఆన్ లైన్ లో "గోఫండ్ మీ"ని ఏర్పాటు చేశారు.
కాగా... అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద తెలుగమ్మాయి సుస్రూణ్య కోడూరు పిడుగుపాటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమె పక్కనే ఉన్న ఆ చెరువులో పడిపోయింది.
ఆ సమయంలో 20 నిమిషాలపాటు గుండె లయ తప్పడంతో మెదడు దెబ్బతిని.. కోమాలోకి వెళ్లిపోయింది. ఆ పరిస్థితిని గమనించిన వ్యక్తి... వెంటనే చెరువులోకి దూకి ఆమెకు సహాయం చేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఎమ్మారై రిపోర్టుల ప్రకారం ఆమెకు అనాక్సిక్ ఎన్సెఫలోపతి వచ్చిందని వైద్యులు తెలిపారు.
మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలాంటి ఈ వ్యాది వస్తుందని తెలిపారు. అనంతరం ఆమెకు ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.