ఇదెక్కడి దారుణం.. భారతీయ విద్యార్థికి 14 ఏళ్ల జైలుశిక్ష!
తాను పనిచేస్తున్న స్టోర్ లో దొంగల బారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు బేస్ బాల్ బ్యాట్ తో వారిపై దాడి చేసినందుకు 14 ఏళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్నాడు
By: Tupaki Desk | 10 April 2024 4:36 AM GMTఇటీవల భారత్ పై తరచూ విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న కెనడాలో మరో దారుణం చోటు చేసుకుంది. కెనడాలోని ఒక స్టోర్ లో పనిచేసుకుంటూ చదువుకుంటున్న 22 ఏళ్ల భారతీయ విద్యార్థి తేజేశ్వర్ కాలియా ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. తాను పనిచేస్తున్న స్టోర్ లో దొంగల బారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు బేస్ బాల్ బ్యాట్ తో వారిపై దాడి చేసినందుకు 14 ఏళ్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్నాడు.
ప్రస్తుతం తేజేశ్వర్ కాలియాపై అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు గృహనిర్బంధంలో ఉన్నాడు. న్యాయపోరాటం చేయడానికి అతడికి ఆర్థిక స్థోమత కూడా లేదు. గృహనిర్బంధంలో ఉండటంతో అటు కాలేజీకి వెళ్లడానికి, ఇటు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది.
ప్రస్తుతం తేజేశ్వర్ కాలియా పీటర్ బరోలో ఉంటున్నాడు. దాడి ఘటన జరిగింది, అతడు పనిచేస్తోంది.. పీటర్ బరోలోనే కావడం గమనార్హం. ఇంత జరిగినా తాను పీటర్ బరోను వదిలిపోనని.. ఈ నగరం అంటే తనకిష్టమని అతడు చెబుతున్నాడు.
ఇప్పుడు తేజేశ్వర్ కాలియా కేసు ఆత్మరక్షణ హక్కు, న్యాయవ్యవస్థ నిబద్ధతపై కెనడాలో చర్చకు దారితీస్తోంది. న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి అతడికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో అతడి స్నేహితులు నిధుల సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో 12 వేల కెనడియన్ డాలర్లను సమీకరించారు.
తేజేశ్వర్ కాలియా అమాయకుడని, స్టోర్ లో దొంగల నుంచి తనను తాను రక్షించుకోవడంలో భాగంగా బేస్ బాల్ బ్యాట్ తో వారిపై అతడు దాడికి దిగడానికి అతడి స్నేహితులు చెబుతున్నారు. అయితే పోలీసులు అతడిని దోషిగా చూపుతున్నారని.. ఈ విషయంలో అతడికి అన్యాయం జరుగుతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడంలో సీసీ టీవీ ఫుటేజీ కీలకంగా మారనుంది. తేజేశ్వర్ కాలియా, అతడి స్నేహితులు చెబుతున్నట్టు సీసీ టీవీ ఫుటేజీలో ఉంటే అతడు నిర్దోషిగా బయటపడే అవకాశం ఉంది. లేదంటే 14 ఏళ్ల జైలుశిక్ష తప్పదని చెబుతున్నారు.
కెనడాలో ఇటీవల కాలంలో భారతీయ విద్యార్థులపై వరుస దాడులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతీయులే లక్ష్యంగా ఖలిస్థాన్ అనుకూలవాదులు రెచ్చిపోతున్నారు. హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే కెనడాలో ఉన్న భారతీయులను అంతమొందిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు కెనడాలో చదువుకోవడానికి, ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న భారతీయులపై జాతివివక్ష కూడా చోటు చేసుకుంటోందనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా తేజేశ్వర్ కాలియా వ్యవహారంలోనూ జాతివివక్ష చూపుతున్నారని, నిందితులను వదిలేసి నిరపరాధి అయిన అతడిపైనే కేసు పెట్టడం ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు.