Begin typing your search above and press return to search.

యూఎస్ అధికారి వెకిలి కామెంట్స్... కేటీఆర్ రియాక్షన్ వైరల్!

సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారి చులకనగా, వైకిలిగా, అహంకారంతో మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2023 6:42 AM GMT
యూఎస్ అధికారి వెకిలి కామెంట్స్... కేటీఆర్ రియాక్షన్ వైరల్!
X

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతి చెందిన ఘటనలో సియాటిల్ నగరానికి చెందిన పోలీసు అధికారి చులకనగా, వైకిలిగా, అహంకారంతో మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సర్వత్రా ఆగ్రహవేశాలు వెల్లువెతుతున్నాయి. ఈ సమయంలో ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

అవును... తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల మృతిపై సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి చులకనగా చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టిని కోరారు. ఇదే సమయంలో ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేయాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ను కూడా అభ్యర్థించారు!

ఈ మేరకు “ఎస్.పి.డి.కి చెందిన ఒక పోలీసు అధికారి పూర్తిగా ఖండించదగిన వ్యాఖ్యలతో తీవ్ర కలత చెంది, చాలా బాధపడ్డాను. ఈ విషయాన్ని యూఎస్ ప్రభుత్వ అధికారులతో సంప్రదించి జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం చేయాలని భారతదేశంలోని అమెరికా రాయబారిని అభ్యర్థిస్తున్నాను. "ఈ విషయాన్ని తన కౌంటర్‌ పార్ట్‌ తో టేకప్ చేయాలని, ఈ విషయంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయాలని జై శంకర్ ను అభ్యర్థిస్తున్నాను" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మరోపక్క... భారతీయ విద్యార్థినీ జాహ్నవి మృతిపట్ల యూఎస్ పో లీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియోపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దృశ్యాలపై వెంటనే దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. ఈ మేరకు శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన దౌత్యకార్యాలయం... "జాహ్నవి కందుల మృతి కేసు విచారణలో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. సియాటిల్‌, వాషింగ్టన్‌ లోని ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశాం" అని ట్వీట్టర్ లో పేర్కొంది.

కాగా... కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి(23) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. ఉన్నత చదువుల నిమిత్తం 2021లో అమెరికా వెళ్లింది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 23న కాలేజీ అయిన తర్వాత రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఆమెను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అయితే తాజాగా ఈ ఘటనపై సియాటిల్‌ నగరానికి చెందిన పోలీసు అధికారి ఒకరు జోకులు వేసుకుంటూ, వెకిలిగా నవ్వుతూ మాట్లాడిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యవహారం సీరియస్ అవ్వడంతో... ఇలా ఇండియా నుంచి రియాక్షన్ వచ్చింది. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు!