యూఎస్ లో తెలుగు టూరిస్ట్ కు 14 ఏళ్ల జైలు శిక్ష... షాకింగ్ రీజన్!
అమెరికాలో అరెస్ట్ చేయబడిన ఓ తెలుగు పర్యాటకురాలి కథ అత్యంత దారుణంగా మారిపోయింది.
By: Tupaki Desk | 15 Feb 2025 12:30 PM GMTకాలం గాలం వేస్తే జీవితంలో ఒక్కసారిగా ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయని.. కొన్ని సందర్భాల్లో జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుందని చెబుతుంటారు. దీన్ని కొంతమంది విధిరాత అని అంటే.. మరి కొంతమంది మరొకటి చెబుతుంటారు. ఏది ఏమైనా... అమెరికాలో అరెస్ట్ చేయబడిన ఓ పర్యాటకురాలి పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా మారిపోయింది.
అవును... అమెరికాలో అరెస్ట్ చేయబడిన ఓ తెలుగు పర్యాటకురాలి కథ అత్యంత దారుణంగా మారిపోయింది. అమెరికాలో ఉన్న తన పిల్లలను చూసి వద్దామని టూరిస్ట్ వీసాలో వెళ్లిన వైద్యురాలు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. అది కూడా చిన్నా చితకా కేసు కాదు.. ఏకంగా 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించే పరిస్థితి నెలకొంది.
వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల ఓ తెలుగు వైద్యురాలు అమెరికాలో ఉన్న తమ పిల్లలను చూడటానికి టూరిస్ట్ వీసాలో వెళ్లారు. ఈ సమయంలో.. పక్కింటివారు వారి 6 నెలల పాపను కాసేపు జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. వాస్తవానికి.. అమెరికాలో పేరెంట్స్ వారి పిల్లలను లైసెన్స్ పొందిన డేకేర్ సెంటర్ లోనే ఉంచుతారు.
అయితే... జాతి సంబంధమో.. లేక, వైద్యురాలిగా, ఎప్పటి నుంచో తెలిసిన పొరుగువారి అమ్మగా వారికి ఆమెపై ఉన్న నమ్మకమో తెలియదు కానీ... ఆ పక్కింటి తల్లితండ్రులు వారి బిడ్డను ఆమె చేతుల్లో పెట్టారు.. సురక్షితంగా ఉంటుందని నమ్మారు.. బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఆ బిడ్డ ఏదో మింగేసినట్లు ఈ వైద్యురాలు గుర్తించారట.
దీంతో... వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె ఆ బిడ్డ గొంతు నుంచి వస్తువును తొలగించడానికి ప్రథమ చికిత్స ప్రయత్నం చేశారంట. అయితే.. ఆమె ప్రయత్నాలు ఫలించకపోవడంతో, వెంటనే బిడ్డ తల్లితండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ (911) కు కాల్ చేశారు.
దీంతో... హుటాహుటిన అంబులెన్స్ లో బిడ్డను తీసుకుని బయలుదేరారు. అయితే.. ఆస్పత్రికి చేరుకునేలోపు మార్గమద్యలోనే పిల్లోడు మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు! అయితే.. బిడ్డ తల్లితండ్రులు మాత్రం ఈ ఘటన తమ దురదృష్టం అని భావించినప్పటికీ.. అమెరికాలోని చట్టం తన పని తాను చేసుకుపోయిందంట.
ఈ సమయంలో... ఓ వ్యక్తి వైద్యులైనప్పటికీ తన కుటుంబ సభ్యులను తప్ప మరెవరినీ చూసుకోకూడదు. ఇదే సమయంలో.. ఎవరికైనా, ఏదైనా ప్రథమ చికిత్స చేయాలనుకుంటే ఆమె ముందుగా 911కి కాల్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఆ చట్టాలపై అవగాహనలేకో ఏమో కానీ.. ఆమె అలా చేయడంలో విఫలమైంది.
దీంతో.. ఆమెకు సంకెళ్లు వేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో కోర్టు ఆమెకు 14 ఏళ్ల జైల్ శిక్ష విధించింది. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.