Begin typing your search above and press return to search.

న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. ఆందోళనలో స్నేహితులు!

ఉన్నత చదువుల కోసం, తద్వారా ఉజ్వల భవిష్యత్తు కోసమని ఏటా చాలా మంది విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Feb 2025 3:05 PM GMT
న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్య.. ఆందోళనలో స్నేహితులు!
X

ఉన్నత చదువుల కోసం, తద్వారా ఉజ్వల భవిష్యత్తు కోసమని ఏటా చాలా మంది విద్యార్థులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల చాలా మంది తెలుగు విద్యార్థులు మృతిచెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో తాజాగా తుమ్మేటి సాయికుమార్ రెడ్డి అనే తెలుగు విద్యార్థి మృతి చెందారని తెలుస్తోంది.

అవును.. ఇటీవల వివిధ కారణాలతో అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కొంతమంది దుండగుల కాల్పుల్లోనూ, మరికొంతమంది రోడ్డు ప్రమాదాల్లోనూ మృతి చెందుతుండగా.. ఇంకొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఈ సమయంలో తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. సాయికుమార్ అక్కడే చదువుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటున్నారని అంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న చోటే సాయికుమార్ రెడ్డి పాస్ పోర్టు ఉందని తెలుస్తోంది.

అతడు ఆత్మహత్య చేసుకోవడంతో స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోగా.. ఈ విషయం ఇంకా కుటుంబ సభ్యులకు తెలియదని చెబుతున్నారు. సాయికుమార్ ఫోన్ లాక్ చేసి ఉండటంతో అతని కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని ఎలా తెలియజేయాలనే విషయంలోనూ సాయి స్నేహితులు ఆందోళనకు గురవుతున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా... డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికాలోని తెలుగు విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బయట పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నవారి పరిస్థితి మరింత దయణీయంగా మారిందని చెబుతున్నారు.

ఇటీవల లాగా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోలేక, విద్యారుణాలు చెల్లించలేక, ఇంట్లో వాళ్లను డబ్బులు అడగలేక విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు. అయితే... సాయికుమార్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది మాత్రం తెలియాల్సి ఉంది.