ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా తెలుగమ్మాయి
విదేశీ గడ్డ మీద మనోళ్లు తమ సత్తా చాటుతున్నారు. అది.. ఇది అన్న తేడా లేకుండా ప్రతి రంగంలోనూ దూసుకెళుతున్నారు. క్
By: Tupaki Desk | 8 Sep 2023 4:24 AM GMTవిదేశీ గడ్డ మీద మనోళ్లు తమ సత్తా చాటుతున్నారు. అది.. ఇది అన్న తేడా లేకుండా ప్రతి రంగంలోనూ దూసుకెళుతున్నారు. క్లిష్టమైన రాజకీయ రంగంలోనూ స్థానికుల మనసుల్ని గెలుచుకొని చట్టసభల్లోకి అడుగు పెడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్ గా తెలుగు మహిళ కర్రి సంధ్యారెడ్డి అలియాస్ శాండీరెడ్డి ఎంపికైన వైనం ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ స్టేట్ లోని సిడ్నీ సిటీలో స్ట్రాత్ ఫీల్డ్ పురపాలక సంఘం డిప్యూటీ మేయర్ గా తెలుగు మహిళ ఒకరు తొలిసారి ఎన్నికైన ఉదంతం చోటు చేసుకుంది. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆమె నిలిచారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు చెందిన ఆమె స్థానిక స్టాన్లీ కాలేజీలో ఇంటర్ చదివారు. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీలో న్యాయవాద పట్టా పొందిన ఆమె.. ఉస్మానియాలో ఎంఏ చేశారు. 1991లో కర్రి బుచ్చిరెడ్డి అనే ఐటీ ఇంజినీర్ తో పెళ్లి జరగ్గా.. భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడి జాతీయ విశ్వవిద్యాలయంలో మైగ్రేషన్ లా డిగ్రీ పొంది.. ఇమ్మిగ్రేషన్ లాయర్ గా పని చేశారు.
భర్తతో కలిసి స్థానికంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని చేస్తున్న ఆమె చొరవతోనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని సౌత్ ఫీల్డ్ లోని హోమ్ బుష్ కమ్యూనిటీ సెంటర్ లో ఏర్పాటు చేయగలిగారు. 2021లో ఆమె నివాసం ఉండే ప్రాంతానికి పురపాలక సంఘ ఎన్నికలు జరగ్గా.. అక్కడి ప్రవాస భారతీయులతో పాటు స్థానికులు ఆమెను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. స్థానిక లేబర్.. లిబరల్ పార్టీల అభ్యర్థులపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిచి గెలుపొందటం విశేషం. ఈ పురపాలన సంఘానికి ఏటా జరిగే మేయర్.. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో.. తాజాగా ఆమె డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు.