గ్యాంగ్ వార్ ఎఫెక్ట్...కెనడాలో భారత సంతతి వ్యక్తుల హత్య!
కెనడాలో వ్యవస్థీకృత నేరాల్లో పేరుమోసినట్లు చెబుతున్న భారత సంతతి సిక్కు వ్యక్తి హర్ ప్రీత్ సింగ్ ఉప్పల్
By: Tupaki Desk | 12 Nov 2023 7:15 AM GMTకెనడాలో వ్యవస్థీకృత నేరాల్లో పేరుమోసినట్లు చెబుతున్న భారత సంతతి సిక్కు వ్యక్తి హర్ ప్రీత్ సింగ్ ఉప్పల్ (41), అతడి కుమారుడు (11) లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఎడ్మంటన్ నగరంలో ఒక పెట్రోల్ పంపు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో హర్ ప్రీత్ కారులో అతడి కుమారుడి స్నేహితుడైన మరో బాలుడు కూడా ఉన్నప్పటికీ... అతడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు.
అవును... కెనడాలోని ఎడ్మోంటన్ లో హర్ ప్రీత్ సింగ్, అతని కుమారుడు ఒక షాకింగ్ సంఘటనలో కాల్చి చంపబడ్డారు. వీరు ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని ఎడ్మోంటన్ పోలీస్ సర్వీస్ యాక్టింగ్ సూపరింటెండెంట్ కోలిన్ డెర్క్ సెన్ వెల్లడించారు.
అంతక ముందు హర్ ప్రీత్ పై మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, చట్టవిరుద్ధంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కలిగి ఉండటం, ఆయుధాలతో దాడి చేయడం, అక్రమంగా తుపాకీని కలిగి ఉండటం వంటి అభియోగాలు ఉన్నాయి. అయితే రెండు ముఠాల మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్ లో భాగంగానే ఈ తాజా హత్యలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం... ఉప్పల్ మరణానికి ఒక రోజు ముందు టొరంటోలో ఇటీవల యూఎన్ గ్యాంగ్ స్టర్ పర్మ్ వీర్ చాహిల్ హత్యతో పరిస్థితి తీవ్రమైందని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ.. ఉప్పల్ హత్యను కెనడాలోని ఇతర ప్రాంతాలలో హింసాత్మకంగా ముడిపెట్టకుండా డెర్క్ సెన్ హెచ్చరించాడు. ఇదే సమయంలో దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని ఉద్ఘాటించారు.
ఇదే సమయంలో... ఈ సంఘటన వెనుక ఉన్న ఉద్దేశాలు, కనెక్షన్ లను అధికారులు లోతుగా పరిశోధిస్తున్నారని చెబుతున్నారు. కాగా... 2013లో అనధికార ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఉప్పల్ 15 నెలల జైలు శిక్ష అనుభవించాడని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతని నుంచి కొకైన్ స్వాధీనం చేసుకోవడంతోపాటు.. అక్రమ రవాణా ఆరోపణలపై ఏప్రిల్ లో విచారణను కూడా ఎదుర్కొన్నాడు.