Begin typing your search above and press return to search.

ట్రెక్కింగ్‌ లో జారిపడ్డారు.. స్కాట్లాండ్‌ లో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి!

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి రకరకాల ప్రమాదాల బారిన పడుతోన్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 10:05 AM GMT
ట్రెక్కింగ్‌  లో జారిపడ్డారు.. స్కాట్లాండ్‌  లో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్  మృతి!
X

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి రకరకాల ప్రమాదాల బారిన పడుతోన్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. పైగా.. ఈ ఏడాది ఆరంభం నుంచీ ఈ లెక్క మరీ ఎక్కువవుతోందని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఆ జాబితాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు చేరారు. ఈ విషాద సంఘటన తాజాగా స్కాట్లాండ్ లో జరిగింది.

అవును... ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదానికి గురై మృతి చెందారు. స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ కి వెళ్లిన వీరిద్దరూ ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి మృతిచెందారు. మృతుల్లు జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) గా చెబుతుండగా.. వీరు స్కాంట్లాండ్ లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... బుధవారం సాయంత్రం జితేంద్రనాథ్, చాణక్యలు మరికొంతమంది భారత స్నేహితులతో కలిసి పెర్త్‌ షైర్‌ లోని "లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌"కి వెళ్లారంట. ఈ క్రమంలో.. ఈ రెండు నదులు కలిసే ప్రాంతంలో ట్రెక్కింగ్‌ చేస్తుండగా వీరిద్దరూ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. దీంతో... సమాచారమందుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు.

ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో వీరిద్దరి మృతదేహాలను గుర్తించారని చెబుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తుండగా నీటిలో పడిపోయారని అంటున్నారు. ఈ ప్రమాదంపై స్పందించిన లండన్‌ లోని భారత హైకమిషన్‌ అధికారి... ఈ ఘటనపై మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో... పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్‌ కు పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో జితేంద్రనాథ్ గతంలో అమెరికాలోని కనెక్టికట్‌ యూనివర్సిటీలో చదవగా.. చాణక్య 2022లోనే హైదరాబాద్‌ జే.ఎన్‌.టీ.యూ లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లు తెలుస్తోంది!