Begin typing your search above and press return to search.

బ్రిటన్ ప్రతిపక్ష నేత మనమ్మాయేనా?

విదేశీ గడ్డ మీద భారత మూలాలు ఉన్న వారి పాత్ర కీలకంగా మారుతున్న సంగతి చూస్తున్నాం

By:  Tupaki Desk   |   18 July 2024 4:54 AM GMT
బ్రిటన్ ప్రతిపక్ష నేత మనమ్మాయేనా?
X

విదేశీ గడ్డ మీద భారత మూలాలు ఉన్న వారి పాత్ర కీలకంగా మారుతున్న సంగతి చూస్తున్నాం. అగ్రరాజ్యంతో పాటు.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మొన్నటివరకు బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ వ్యవహరించటం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమిపాలు కావటం.. సుదీర్ఘ విరామం తర్వాత లేబర్ పార్టీ అధికారపక్షంగా అవతరించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా యూకే ప్రతిపక్ష నేతగా భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ప్రీతి పటేల్ కానున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

ప్రతిపక్ష నేత పదవికి ఆమె పోటీ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విథామ్ నుంచి పార్లమెంట్ కు ఆమె ఎన్నికయ్యారు. ఉగాండాలో స్థిరపడి బ్రిటన్ కు వలస వచ్చిన గుజరాతీ సంతతి తల్లిదండ్రులకు ఆమె జన్మించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ ఓటమి నేపథ్యంలో మాజీ ప్రధానమంత్రి రిషి తాత్కాలిక ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పదవికి కొత్త వారు ఎన్నికయ్యే వరకు ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇదిలా ఉంటే.. ప్రీతి ఎన్నికల అంత సులువు కాకపోవచ్చని.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు పోటీ పడే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ పోటీలో ఆమె మరో భారత సంతతికి చెందిన సువేలా బ్రేవర్ మన్ నుంచి పోటీ ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ప్రీతికి కలిసి వచ్చే అంశం ఏమంటే.. ఆమె గతంలో డేవిడ్ కామెరాన్ ప్రభుత్వంలో భారత సంతతి ప్రతినిధిగా వ్యవహరించారు.

అంతేకాదు.. కన్సర్వేటివ్ ప్రధానమంత్రులు థెరెసా మే.. బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేసిన అనుభవం.. వారితో ఉన్న అనుబంధం ఆమెకు కలిసి వచ్చే వీలుంది. అదే సమయంలో మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ అధిక పన్నుల విధానాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించేవారు. మొత్తంగా.. మిగిలిన నేతలతో పోలిస్తే ప్రతిపక్ష స్థానానికి ప్రీతికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ.. ఆమె కానీ ఎన్నికైతే.. ప్రధానమంత్రిగా భారత సంతతి వ్యక్తి చేపట్టటమే కాదు.. అధికారం కోల్పోయిన తర్వాత.. ప్రతిపక్ష నేతగా భారత సంతతి వ్యక్తికే పదవి లభించటం ఆసక్తికర పరిణామంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.