అమెరికాలో కుటుంబ (ఆత్మ)హత్య కేసులో అనుమానితుడు గుర్తింపు!
అవును... అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతి సంతతి కుటుంబం అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Feb 2024 11:50 AM GMTఅమెరికాలో ఒక కుటుంబం మొత్తం అనుమాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియా రాష్ట్రంలో సొంతింటిలోనే భారత సంతతి కుటుంబం అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంట్లో ఎవరూ ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో అనుమానం వచ్చిన వారి సన్నిహితులు... స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ మరణాలకు కారణమైన అనుమానితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది!
అవును... అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతి సంతతి కుటుంబం అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మృతులను కేరళకు చెందిన ఆనంద్ సుజిత్ హెన్రీ (42), ప్రియాంక (40), నాలుగేళ్ల వయసున్న కవలలు నోహ్, నీథన్ లుగా గుర్తించారు. అయితే... ఇరు దేశాల్లోనూ తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ఆనంద్ హెన్రీని పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు!
ఇందులో భాగంగా... లాస్ పులగాస్ లో నివసిస్తున్న సుజిత్ అనే వ్యక్తి వారి ఇంటికి ఫోన్ చేయగా ఎంతకు వారెవరూ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన అతడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఇంటిని తనిఖీ చేసేందుకు వెళ్లిన పోలీసులు... తలుపులన్నీ లోపల నుంచి గడియపెట్టి వుండటంతో చిన్న కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించారు.
ఈ సమయంలో బాత్రూం వద్ద దంపతుల మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించగా.. వారి శరీరంపై తుపాకీతో కాల్చిన గాయాలున్నాయి. వారి పక్కనే 9 ఎం ఎం తుపాకీ, తూటాలను పోలీసులు గుర్తించారు. మరోపక్క బెడ్రూంలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. అయితే వీరి శరీరంపై మాత్రం ఎలాంటి తుపాకీ గాయాలు కనిపించలేదని తెలుస్తుంది.
దీంతో... ఇంట్లోకి ఎవరూ ప్రవేశించిన ఆనవాళ్లు లేకపోవడంతో కుటుంబంలోని వ్యక్తే వీరి మరణాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా... ఆనంద్ హెన్రీ.. తన భార్యా పిల్లలను హత్య చేసి, అనంతరం తనను తాను కాల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య, ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోపక్క... ఆనంద్ దంపతులు 2016లోనే విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. దానికి సంబందించిన ప్రోసిడింగ్స్ ఇంకా కోర్టులో జరుగుతున్నాయని తెలుస్తుంది. అయినప్పటికీ చాలా కాలంగా స్నేహితులుగానే ఒకే ఇంట్లో నివాసముంటున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘోరం జరిగిందని అంటున్నారు.