కారణమేంటి? హెచ్ 1బీ వీసా లాటరీ అప్లికేషన్లలో భారీ తగ్గుదల
డాలర్ కలల్ని నెరవేర్చుకునేందుకు లక్షలాది మంది ఎంచుకునే మార్గం హెచ్1బీ వీసా
By: Tupaki Desk | 2 May 2024 6:50 AM GMTడాలర్ కలల్ని నెరవేర్చుకునేందుకు లక్షలాది మంది ఎంచుకునే మార్గం హెచ్1బీ వీసా. దీని కోసం ఎంతలా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెచ్ 1బీ వీసా దరఖాస్తులను లాటరీ పద్దతిలో ఎంపిక చేయటం తెలిసిందే. దీంతో.. లక్ ఉన్న వారికి తప్పించి.. మిగిలిన వారికి దరఖాస్తులు లాటరీలో తగలని పరిస్థితి. అందుకే.. లాటరీలో అప్లికేషన్ పిక్ అయ్యేందుకు వీలుగా పలు విధాలుగా ప్రయత్నాలు చేయటం తెలిసిందే.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హెచ్1బీ వీసా అప్లికేషన్ లాటరీ కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి మరీ తక్కువగా రావటం ఆసక్తికరంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ అప్లికేషన్లు వచ్చినట్లుగా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించింది.
2023లో 7,58,994 అప్లికేషన్లు రాగా ఈ ఏడాది 4,79,342 మాత్రమే వచ్చినట్లుగా యూఎస్ సీఐఎస్ పేర్కొంది. అప్లికేషన్లు తక్కువగా వచ్చినప్పటికీ అప్లై చేసిన ఉద్యోగాల సంఖ్య మాత్రం గత ఏడాదితో సమానంగా ఉండటం గమనార్హం. దీనికి కారణం.. హెచ్ 1బీ వీసా లాటరీ కోసం దాఖలు చేసే దరఖాస్తుల విషయంలో తీసుకున్న చర్యలే తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు.
గతంలో హెచ్ 1బీ లాటరీ కోసం మాన్యువల్ గా అప్లికేషన్లు అప్లై చేసుకునే పద్దతి ఉండేది. తర్వాత దాని స్థానే ఎలక్ట్రానిక్ పద్దతిని ప్రవేశ పెట్టారు. అయితే.. లాటరీలో తమఅప్లికేషన్లు పిక్ చేసుకోవటానికి వీలుగా కొన్ని కంపెనీలు.. వ్యక్తులు తప్పుడు పనులకు పాల్పడటంతో.. దానికి చెక్ పెట్టేందుకు వీలుగా కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారు. ఒకరు ఒక్క అప్లికేషన్ మాత్రమే దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అలాంటి వారి మీద చర్యలు తీసుకుంటామని పేర్కొనటంతో.. దరఖాస్తులు తగ్గి ఉంటాయని అంచనా వేస్తున్నారు.