అతడి మాటలు 'ఆర్ఆర్ఆర్' స్కాట్ దొర అహంకారాన్ని గుర్తుకు తెచ్చింది
ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి గుండె రగిలే సీన్లలో ముఖ్యమైంది.. మూవీలో విలన్ స్కాట్ దొర భారతీయుడి ప్రాణానికి వెల కట్టే సందర్భంలో చేసే వ్యాఖ్య ఒంటి మీద కారం రాసినట్లుగా మారుతుంది.
By: Tupaki Desk | 14 Sep 2023 4:31 AM GMTఆర్ఆర్ఆర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి గుండె రగిలే సీన్లలో ముఖ్యమైంది.. మూవీలో విలన్ స్కాట్ దొర భారతీయుడి ప్రాణానికి వెల కట్టే సందర్భంలో చేసే వ్యాఖ్య ఒంటి మీద కారం రాసినట్లుగా మారుతుంది. ఇంత లోకువగా కనిపిస్తున్నామా? అంటూ ఆవేశం కట్టలు తెగేలా ఉంటుంది. రీల్ సీన్ అయినప్పటికీ రియల్ సీన్ కు మించి కనెక్టు కావటం.. స్కాట్ దొర అంటే మండిపాటు వ్యక్తమవుతుంది. రీల్ కు మించిన దారుణం రియల్ గా చోటు చేసుకున్న వైనం చూస్తే.. ప్రాశ్చాత్య దేశాల్లోని కొందరికి భారతీయులంటే మరి ఇంత చులకనా భావమా? అన్న ఆగ్రహం వ్యక్తం కావటం ఖాయం.
అమెరికాలోని భారత విద్యార్థిని జాహ్నవి (23) ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లటం.. ఈ ఏడాది జనవరి 23న కాలి నడకన రోడ్డు దాటుతున్నవేళ.. పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీ కొనటంతో ఘటనా స్థలంలోనే ఆమె మరణించారు. ఆ టైంలో ఆ వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడుపుతున్నాడు.దర్యాప్తులో భాగంగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావటం పాత విషయమే.
ప్రమాదం జరిగిన సందర్భంలో దర్యాప్తు కోసం వచ్చిన పోలీసు అధికారి డానియల్ వేసిన జోకులు చూస్తే.. స్కాట్ దొరకు మించినట్లుగా వారి తీరు ఉందని చెప్పక తప్పదు. బాడీ కెమెరా ఉన్నప్పటికీ ఇంతటి బరితెగింపు అంటే.. అతగాడి అహంకారం ఏ మోతాదులో ఉందో అర్థమవుతుంది. ‘ఆమె మామూలు మనిషే. 11 వేల డాలర్ల చెక్కు రాసేయండి సరిపోతుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్క భారతీయుడి మనసు మాత్రమే కాదు.. మనసున్న ప్రతి ఒక్కరు వేదన చెందేలా ఉంది. ఇదే వీడియోలో ఆ అధికారి అహంకారం ఎంతన్న విషయాన్ని చెప్పే మాటలు కొన్ని ఉన్నాయి.
"ఆమె వయసు 26 ఏళ్లు ఉండొచ్చు. ఆమె లైఫ్ కు వాల్యూ తక్కువ'' అని వ్యాఖ్యానించటమే కాదు.. డ్రైవర్ తప్పేమీ లేదని.. క్రిమినల్ దర్యాప్తు అవసరం లేదంటూ ఉన్నతాధికారికి చెప్పటం షాకింగ్ గా మారింది. బాడీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజ్ బయటకు రావటంతో.. సదరు అధికారి స్కాట్ దొరకు మించిన అహంకారాన్ని ప్రదర్శించినట్లుగా అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారి.. పెద్ద ఎత్తున నిరసన.. ఆగ్రహం వ్యక్తం కావటంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో స్కాట్ దొర అహంకారానికి హీరో సరైన బదులు క్లైమాక్స్ లో చెబుతాడు. మరీ.. ఈ మదమెక్కిన తెల్ల పోలీసు అధికారికి ఎలాంటి శిక్ష వేస్తారో చూడాలి. భారతీయుల్ని ఒక మాట అనే ముందు.. ఆచితూచి అన్న విషయం అందరికి అర్థమయ్యేలా స్పందించాల్సిన అవసరం ఉంది.