Begin typing your search above and press return to search.

యుఎస్‌ లో రైస్ బ్యాన్‌ ఎఫెక్ట్... భయాందోళనలో తెలుగు సమాజం!

ఇప్పుడు అమెరికాలో రైస్ బ్యాగ్ ల ధరలు ఒక్కసారిగా డబుల్ అయిపోయాయని అంటున్నారు

By:  Tupaki Desk   |   22 July 2023 4:29 AM GMT
యుఎస్‌  లో రైస్  బ్యాన్‌  ఎఫెక్ట్... భయాందోళనలో తెలుగు సమాజం!
X

భారతదేశంలో ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి తెలిసిందే. టమాటా పేరు చెబితేనే.. సామాన్యుడు మొబైల్ లో ఫోటో చూసుకుంటూ కూర వండుకుని తినే పరిస్థితి అన్నా అతిశయోక్తి కాదేమో! ఆ సంగతి అలా ఉంటే… తాజాగా అమెరికాలో ఉన్న భారతీయులకు, మరి ముఖ్యంగా తెలుగువారికి పెద్ద సమస్యే వచ్చి పడింది.

అవును... అమెరికాలో ఉన్న భారతీయులకు, మరి ముఖ్యంగా తెలుగువారికి పెద్ద కష్టం వచ్చి పడింది. దేశీయ ధరలను అరికట్టడం, తృణధాన్యాల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా... భారత ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై తక్షణ నిషేధం విధించింది. దీంతో అమెరికాలో బియ్యం కోసం తెలుగు జనం పేనిక్ అవుతున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో కొరత ఉంటే ధరలు ఆకాశాన్నంటే విషయంలో అమలాపురం అయినా అమెరికా అయినా ఒక్కటే అన్నట్లుగా... ఇప్పుడు అమెరికాలో రైస్ బ్యాగ్ ల ధరలు ఒక్కసారిగా డబుల్ అయిపోయాయని అంటున్నారు. ఫలితంగా... కొన్ని దుకాణాల్లో నిన్న మొన్నటివరకూ 22 డాలర్లు ఉన్న రైస్ బ్యాగ్... ఇప్పుడు 32 – 47 డాలర్ల వరకూ పెరిగిపోయిందని తెలుస్తుంది.

కాగా... మొత్తం ఎగుమతుల్లో బాస్మతీయేతర బియ్యం 80% వాటాతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న సంగతి తెలిసిందే. ఫలితంగా... ఈ నిర్ణయం ప్రపంచ ధాన్యం సరఫరాపై కచ్చితంగా ప్రభావం చూపవచ్చని అంటున్నారు.

ఇదే క్రమంలో... 2012 నుండి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది. యూఎస్ తో సహా 100 కంటే ఎక్కువ దేశాలకు భారతదేశం రైస్ ఎగుమతులు ఉన్నాయి. అయితే... భారత్ నుంచి రైస్ ని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా ప్రధానంగా ఉన్నందువల్ల... ఆ దేశంలోని భారతీయులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు.

యుఎస్‌ లోని భారతీయులు, ప్రధానంగా తెలుగు సమాజం, ముఖ్యంగా సోనా మసూరి రైస్ తినకుండా జీవించడాన్ని ఊహించలేరని అంటుంటారు. ఇందులో భాగంగా భారతీయ బ్రాండ్ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి వారంతా ఎక్కువగా "పటేల్ బ్రదర్స్" వంటి కిరాణా దుకాణాల్లో క్రమం తప్పకుండా వరుసలో కనిపిస్తుంటారంట.

అయితే ఈ నిషేధం ఎంతకాలం కొనసాగుతుందనేది తెలియదు. కిరాణా దుకాణాలు తగినంత పరిమాణంలో నిల్వ ఉన్నంత వరకు, తక్షణ సంక్షోభం ఉండకపోవచ్చు. అయితే, ఈ నిషేధం చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం... తెలుగు ప్రజలు కొంత కాలం పాటు సోనా మసూరి రైస్ స్థానంలో వారు ఏమాత్రం ఇష్టపడని మెక్సికన్ బ్రాండ్ల బియ్యాన్ని ఎంచుకోవలసి ఉంటుంది.

అయితే ఇప్పటికే చాలా భారతీయ దుకాణాల్లో ఈ రైస్ అమ్మకాలను "1 వ్యక్తి - 1 బ్యాగ్" అనే సూత్రానికి పరిమితం చేశాయని తెలుస్తుంది. దీంతో యూఎస్ స్టోర్లలో బియ్యం బస్తాల కోసం క్యూలు, కొట్లాటలు చూపిస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి." అగ్రరాజ్యంలో ఆంధ్రుడికి ఇదేమి కష్టంరా బాబూ" అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా... ప్రజలు తమ కారు డిక్కీలను పదుల సంఖ్యలో బ్యాగులతో నిల్వ చేసుకోవడం కనిపించగా, మరికొందరు ఒక్క బ్యాగ్ కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి. ఈ భయాందోళనలు కోవిడ్ సమయంలో శానిటైజర్, పేపర్ రోల్స్ కొరతను గుర్తు చేస్తున్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.

అయితే మరోపక్క భారత రైస్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి. కృష్ణారావు... "సంక్షేమ పథకాలకు అవసరమైన దానికంటే ఎక్కువ నిల్వలను ప్రభుత్వం కలిగి ఉంది. ఎగుమతులను పరిమితం చేయవలసిన అవసరం లేదు" అని చెప్పారని తెలుస్తుంది.

అయితే మరోపక్క భారత రైస్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బి.వి. కృష్ణారావు... "సంక్షేమ పథకాలకు అవసరమైన దానికంటే ఎక్కువ నిల్వలను ప్రభుత్వం కలిగి ఉంది. ఎగుమతులను పరిమితం చేయవలసిన అవసరం లేదు" అని చెప్పారని తెలుస్తుంది.

ఇదే సమయంలో లూసియానా రైస్ మిల్లర్, యూఎస్ రైస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ కమిటీ చైర్మన్ అయిన బాబీ హాంక్స్... "పది మిలియన్ల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ స్టాక్‌ లలో ఉన్నప్పటికీ.. దేశీయ సరఫరాలపై ఆందోళనలను ఉటంకిస్తూ.. ప్రపంచ ఆహార భద్రతతో భారతదేశం ఆటలు ఆడుతుందనడానికి ఇది మరొక ఉదాహరణ. ఈ చర్యతో, భారతదేశం త్వరగా మరిన్ని స్టాక్‌ లను నిర్మించగలదు.. అవి చివరికి ప్రపంచ మార్కెట్‌ లో చౌక ధరలకు తిరిగి వస్తాయి." అని వ్యాఖ్యానించారని తెలుస్తుంది.